– తహశీల్దార్ జి.విజయ లక్ష్మి & సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగమల్లేశ్వరరావు
– సమర్థ పాలకులను ఎన్నుకోవడానికి ఏకైక ఆయుధం ఓటు
– ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం
చీరాల : సమగ్రత, అభివృద్ధి కోసం పాలకులను ఎన్నుకోవటానికి ఓటు పాత్ర కీలకమని, అది ఒక వజ్రాయుధమని తహశీల్దార్ విజయలక్ష్మి పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం ర్యాలీ, మానవ హారం, బహిరంగ సభ నిర్వహించారు. సభలో వృద్ద ఓటర్లకు సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు.
సభలో తహశీల్దారు విజయలక్ష్మి మాట్లాడుతూ భారత పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు అన్నారు. పాలకులను ఎన్నుకోవడమే ఓటు ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఓటు హక్కును సుమారు 20 నుంచి 30 శాతం ప్రజలు ప్రతి ఎన్నికల్లోనూ సద్వినియోగం చేసుకోవటం లేదన్నారు. ప్రధాన కారణం ఓటు ప్రాముఖ్యత, విలువ తెలియకపోవడం, అవగాహనలేకనే అన్నారు. నూరుశాతం పోలింగ్ సాధించే దిశగా ఎన్నికల సంఘం ఓటుప్రాముఖ్యత, నమోదుపై ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఓటుపై చైతన్యం తీసుకురావటం, యువతను ఓటు నమోదుకు ప్రోత్సాహించేందుకు దృష్టి సారిస్తున్నదన్నారు. సమర్థ పాలకులను ఎన్నుకోవటానికి ఓటు ప్రజలకు ఆయుధమని పేర్కొన్నారు.
సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగమల్లేశ్వర రావు మాట్లాడుతూ ఎన్నికైన ప్రజాప్రతినిధులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశాభివృద్ధికి సేవాభావం ఉన్న ప్రజాప్రతినిధులను స్వేచ్ఛగా, ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు ద్వారా ఎన్నుకోవాలన్నదే ఎన్నికల సంఘం ముఖ్యఉద్దేశం అన్నారు. 18ఏళ్లు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించిందన్నారు. 1950 జనవరి 25వ తేదీ ఎన్నికల సంఘం ఏర్పాటైనప్పటి నుంచి ప్రతి ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తోందన్నారు. రాజకీయ వ్యవస్థ పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో యువతను భాగస్వామ్యులు చేయాలని, ఓటు ప్రాముఖ్యతను వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించిందని పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2011జనవరి 25న గుర్తించిందన్నారు. 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పాటైందని వివరించారు. 18 ఏళ్లు నిండిన యువతకు కొత్త ఓటు కల్పించడం, ఓటు సవరణ, ఓటు విలువ, ప్రాముఖ్యతను చాటి చెప్పేలా ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నదన్నారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ సిటిజన్ లను సన్మానించారు. వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించడంతో పాటు సత్కరించారు. కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్ రామచంద్రుని వాసు, ఎన్నికల విభాగం ఇంచార్జి ఆర్ సుశీల, రాంబాబు, పవని భానుచంద్రమూర్తి, సీనియర్ సిటీజన్లు సుబ్బరామయ్య, హనుమంతరావు, మోహన్ రావు, సుభాష్ రెడ్డి, కోన రమణారావు, కాకరపర్తి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.