ఒంగోలు : “కొండేపి వైసిపి నాయకులు వరికూటి అశోక్‌బాబు విషయంలో మావైపు నుండి ఎక్కడో పొరపాటు జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా అభ్యర్ధులను ప్రకటించలేదు. వెంకయ్య అసమన్వయకర్త అంటే అభ్యర్ధని అర్ధం కాదు. పని చేయమన్నాం. అంతవరకే. మిగిలిన విషయాలు జగన్ దృష్టికి తీసుకెళతా. కొండేపి నియోజకవర్గం నుండి మీరూ వచ్చి జగన్‌కు సమస్యను వివరించండి.“ వైఎస్ఆర్‌సిపి రాష్ట్ర క్రమశిక్షణా విభాగం కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
కొండేపి వైఎస్ఆర్‌సిపి ఇన్‌ఛార్జిగా నాలుగేళ్లు పార్టీని నడిపి ప్రస్తుతం నియోజకవర్గ నాయకునిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వరికూటి అశోక్‌బాబును పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు వచ్చిన ప్రకటనలకు నిరసనగా ఆమరణ దీక్షలకు కూర్చున్నారు. దీంతో పరిస్థితిని చర్చించేందుకు వచ్చిన విజయసాయిరెడ్డికి కొండేపి వైసిపి నాయకులుతోపాటు అశోక్‌బాబు సోదరుడు డాక్టర్ వరికూటి అమృతపాణి నియోజకవర్గ పరిస్తితులను వివరించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే పార్టీ తీసుకున్న నిర్ణయంపై ప్రశ్నించారు. సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించే ముందు నోటీసు ఇచ్చి, పార్టీ క్రమశిక్షణా కమిటి చర్చించకుండా ఏవిధంగా నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారని ప్రశ్నించారు. వివరాలు తెలుసుకున్న విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కొండేపి అశోక్‌బాబు విషయంలో ఎక్కడో పొరపాటు జరిగిందని అన్నారు. సమన్వయకర్తగా డాక్టర్ వెంకయ్యను ప్రకటించినంత మాత్రాన ఆయన వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధి కాదని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా అభ్యర్ధులను ప్రకటించలేదన్నారు. గురువారం ఉదయం జగన్‌మోహన్‌రెడ్డి ఫోనులో అశోక్‌బాబుతో మాట్లాడతారని చెప్పారు. ఆందోళన విరమించాలని సూచించారు. జగన్‌తో మాట్లాడిన తర్వాత ఆందోళన విరమిస్తామని పేర్కొన్నారు.