Home ఆంధ్రప్రదేశ్ బాధితులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి

బాధితులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి

9
0
oplus_2

• కులాంతర వివాహాలకు రక్షణ చట్టం తీసుకురావాలి
• చీరాలలో 14 నుండి 16 రాష్ట్ర సామాజిక శిక్షణ తరగతులు
• కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి
చీరాల (DN5 News) : రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో పాలక ప్రభుత్వాలు విఫలమవడమే కాకుండా ముద్దాయిలను కాపాడుతున్నారని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి ఆరోపించారు. స్థానిక సిఐటియు (CITU)కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ జిల్లాలోని సామర్లకోట సమీప వేటపాలెంలో జరిగిన బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనలో 21 మంది మృతి చెందడం దురదృష్టకరమని అన్నారు. మృతుల్లో ఎక్కువ మంది దళితులేనని అన్నారు.

ప్రతి కుటుంబానికి రూ.1కోటి ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, అనుమతులు ఇచ్చిన అధికారులను బాద్యులుగా నిర్ధారించాలని కోరారు. ఫైర్‌ ఇంజన్ వెళ్లే వీలులేని ప్రాంతానికి ఎలా అనుమతులు మంజూరు చేశారో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ లేకుండా పోతుందని అన్నారు. దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయని అన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులకు రక్షణ కల్పించే ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు.

కులాంతర వివాహాలపై దాడులు, హత్యలు ఆందోళనకరమని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ (Dr.BR.Ambedkar) కోరుకున్నట్లు కులాంతర వివాహలు ద్వారానే కులనిర్మూలన జరుగుతుందనే ఆయన ఆశయాలు తుంగలో తొక్కుతున్నారని అన్నారు. ఇలాంటి దాడులు, హత్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కులాంతర వివాహాలు ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. దళితులకున్న రక్షణ చట్టాలు, హక్కులపై చైతన్యం చేసేందుకు చీరాలలో మార్చి 14, 15, 16 తేదీల్లో రాష్ట్ర స్థాయి సామాజిక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ తరగతులు విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో కెవిపియస్ నాయకులు లింగం జయరాజు, కోలా శరత్, నలతోటి బాబురావు పాల్గొన్నారు.