చీరాల : కరోనా విపత్కర సమయంలో నాడు నేడు పనుల ఆలస్యం పేరుతో ప్రధానోపాధ్యాయులను బాధ్యులను చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి మెమోలు జారీ చేయడాన్ని యుటిఎఫ్ గా తీవ్రంగా ఖండిస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు జి సూరిబాబు, షేక్ జానిబాషా, ఎయిడెడ్ కన్వీనర్ కె వీరాంజనేయులు, ఆడిట్ కమిటీ సభ్యులు షేక్ మహమ్మద్ ఖాసిం, కుటుంబ సంక్షేమ పథకం డైరెక్టర్ హైమరావు, జనవిజ్ఞానవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్రా రామారావు తెలిపారు. నిర్మాణ పనుల్లో అనుభవం లేని ప్రధానోపాధ్యాయులకు పాఠశాలలో నాడు-నేడు పనుల అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నిర్మాణ కూలీలు సరిగా రాకపోవడం, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం వలన పనులు ఆలస్యమైనట్లు తెలిపారు. నిర్మాణ సామాగ్రి దుకాణాలు అందుబాటులో లేకపోవడంతో ఇసుక, సిమెంట్ లభించకపోవడం వంటి ప్రత్యేక పరిస్థితులు తెలిసి కూడా ఎలా మెమోలు ఇచ్చారని అన్నారు. వీటికి ప్రధానోపాధ్యాయులను బాధ్యులను చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వానికి పలు రకాలుగా సహకరించినప్పటికీ ఇలా ఉపాధ్యాయులపై కక్షపూరితంగా వ్యవహరించడం మంచి పద్దతి కాదని సూచించారు. ఈ వైఖరిని విడనాడాలని కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి జారీ చేసిన మెమోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.