Home అంతర్జాతీయం ర‌ష్యానుండి యుద్ద విమానాల కొనుగోళ్ల‌కు ఆంక్షలు పెడితే… ప్రతిచర్య తప్పదని అమెరికాను హెచ్చ‌రిస్తున్న చైనా

ర‌ష్యానుండి యుద్ద విమానాల కొనుగోళ్ల‌కు ఆంక్షలు పెడితే… ప్రతిచర్య తప్పదని అమెరికాను హెచ్చ‌రిస్తున్న చైనా

1109
0

ఇంట‌ర్నెట్ డెస్క్ : అమెరికా, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ కొత్త స‌మ‌స్య‌లకు కార‌ణ‌మ‌వుతుంది. ఇరుదేశాల మ‌ద్య వాణిజ్య వివాదం ఇంకా సద్దుమణుగకముందే మరో వివాదం రాజుకుంది. రష్యా నుంచి యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు చైనా సంప్ర‌దింపులు జ‌రుపుతుంది. ఈ నేప‌ద్యంలో చైనాపై అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికా ఆంక్ష‌ల‌పై చైనా కూడా దీటుగా బదులిచ్చింది. ఆంక్షలు వెనక్కి తీసుకోవాలని హెచ్చ‌రించింది. లేదంటే ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికాకు చైనా సూచించింది.

రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణులు, సుఖోయ్‌ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు చైనా ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. చైనా, ర‌ష్యా దేశాల మ‌ధ్య‌ ఒప్పందాలకు అమెరికా అడ్డుపడింది. రష్యా నుండి యుద్ధ విమానాలు, క్షిపణులు చైనా కొనుగోలు చేయకుండా అమెరికా ఆంక్ష‌లు విధించేందుకు సిద్ద‌మైంది. చైనా మిలిటరీ యూనిట్‌పై ఆర్థికపరమైన నిబంధ‌న‌లు అమెరికా విధించింది. యుద్ద‌సామాగ్రి విక్ర‌యించ‌కూడ‌ద‌ని రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘించింది. చైనా ఎక్విప్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ విభాగం(ఈడీడీ) ఈ యుద్ధవిమానాలు ర‌ష్యానుండి కొనుగోలు చేస్తోందని యూఎస్ ఆరోపించింది. ఈడీడీ డైరెక్టర్ లి షంగ్ఫూ పేరును అమెరికా ఆంక్షల్లో చేర్చింది.

అగ్రరాజ్యం అమెరికా నిర్ణయంపై చైనా మండిపడింది. వెంటనే తప్పును సరిదిద్దుకోవాలని సూచించింది. లేకుంటే ప్రతిచర్య తప్పదని హెచ్చరించింది. ‘అమెరికా ఆంక్షలను చైనా ఎన్నటికీ సహించబోదు. అంతర్జాతీయ దౌత్య‌ ప్రాథమిక నిబంధనలను అమెరికా ఉల్లంఘిస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. ఇలాంటి నిర్ణ‌యాల వ‌ల్ల‌ ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. వెంట‌నే అమెరికా తన తప్పును సరిదిద్దుకోవాలి. ఆంక్షలను వెనక్కితీసుకోవాలి. లేకుంటే భవిష్య‌త్‌ పరిణామాలను అమెరికా ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అంటూ చైనా విదేశాంగ ప్రతినిధి గెంగ్‌ షువాంగ్‌ అన్నారు.

నిప్పుతో చెలగాటమొద్దు : రష్యా
అమెరికా ఆంక్షలపై రష్యా కూడా ఘాటుగా స్పందించింది. అర్థం లేని నిబంధనల‌తో నిప్పుతో చెలగాటమాడొద్దని ర‌ష్యా హెచ్చరించింది. ‘ప్రపంచ దేశాల మ‌ద్య‌ అంతర్జాతీయ స్థిరత్వం ఉందనే అంశాన్ని అమెరికా గుర్తుపెట్టుకుంటే మంచిది. రష్యా – అమెరికా మధ్య ఉద్రిక్తతను పెంచుతూ ఆ ప్రపంచ స్థిరత్వాన్ని తగ్గించాలని చూస్తున్నారు. నిప్పుతో చెలగాటమంటే అది పిచ్చి పని, చాలా ప్రమాదకరం కూడా’ అని రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబోవ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

చైనాపై ఆంక్ష‌లు – భారత్‌పై ప్రభావం..
చైనాపై అమెరికా విధిస్తున్న‌ ఆంక్షలు భారత్‌పై కూడా ప్రభావం చూపే అవకాశ‌ముంది. ఎందుకంటే రష్యా నుండి ఐదు ఎస్‌-400 ట్రయంఫ్‌ క్షిపణులను భార‌త్‌ కొనుగోలు చేయాలని భావిస్తోంది. అవే క్షిపణులు, యుద్ధ విమానాల కొనుగోలుకు చైనాపై ఆంక్షలు విధించడంతో భారత్‌ను కూడా అమెరికా పరోక్షంగా హెచ్చరించినట్లవుతుంది.

అమెరికా ఆంక్షల కారణంగా.. చైనా ఈడిడికి అమెరికా న్యాయవ్యవస్థ పరిధిలో లేక‌ అమెరికా ఆర్థిక వ్యవస్థను ఉపయోగించి విదేశీ మారక లావాదేవీలు చేసేందుకు అనుమతి ఉండదు. ఈడీడీ డైరెక్టర్‌పై ఆంక్షల కార‌ణంగా ఆయన అమెరికా వీసా పొందలేరు. తాజా ఆంక్షల నేపథ్యంలో ఆమెరికా, చైనా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు త‌లెత్తుతున్నాయి.