Home బాపట్ల శ్రీ గౌతమిలో కెరీర్ గైడెన్స్‌పై అవగాహన

శ్రీ గౌతమిలో కెరీర్ గైడెన్స్‌పై అవగాహన

17
0

చీరాల (DN5 News) : స్థానిక శ్రీ గౌతమి డిగ్రీ కళాశాలలో (Sri Gouthami Degree College)విద్యార్థుల భవిష్యత్ దిశగా మార్గనిర్దేశం చేసేందుకు కెరీర్ గైడెన్స్‌పై గురువారం సెమినార్‌ నిర్వహించారు. విశ్రాంత ప్రిన్సిపల్, సామాజిక సేవకులు డాక్టర్‌ సత్రం మల్లేశ్వరరావు హాజరై విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు. ప్రతి విద్యార్థికి కచ్చితమైన లక్ష్యం ఉండాలని, లక్ష్యం లేకుండా చేసే ప్రయత్నాలు ఫలించవని చెప్పారు. జీవితంలో స్పష్టమైన దిశ, దృఢ సంకల్పం అవసరమన్నారు. తల్లి, దండ్రుల శ్రమను ఎప్పటికీ మరచిపోవద్దు చెప్పారు. మన భవిష్యత్తు కోసం వారు పడే కష్టం, త్యాగం అమూల్యమైనవని అన్నారు. వారి ఆశలను నెరవేర్చడం ప్రతి విద్యార్థి బాధ్యతని సూచించారు.

ఏకాగ్రత చదువుపైన, నిర్ణయించిన లక్ష్యంపైనే కేంద్రీకృతం కావాలని అన్నారు. మధ్యలో వచ్చే ఆటంకాలు, ఆకర్షణలు, నిరుత్సాహాలతో దారి తప్పకూడదని తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన, కృషి వంటి గుణాలు అలవాటు చేసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా విజయాన్ని సాధించవచ్చని పేర్కొన్నారు. విఫలమైతే నిరుత్సాహ పడకూడదని, ప్రతి వైఫల్యం ఒక పాఠం నేర్పుతుందని అన్నారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే విజయం సాధ్యమవుతుందని ప్రోత్సహించారు. కళాశాల కరస్పాండెంట్ ఎంవి మాస్టారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌ దిశగా మార్గనిర్దేశం చేయడానికి సమయాన్ని కేటాయించి, విలువైన సూచనలు చేసిన డాక్టర్‌ సత్రం మల్లేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అనుభవం, సేవాభావం, విద్యార్థులపై ఉన్న మమకారం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలు సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆశలు నెరవేర్చే విధంగా కృషి చేయాలని ఆకాంక్షించారు.