చీరాల : బ్యాంకులో తీసుకున్న అప్పులకు, ఆన్‌లైన్ లోన్ యాప్‌లలో తీసుకున్న అప్పుకు చెల్లించాల్సిన నెలవారీ వాయిదాలు చెల్లించలేక ఇద్దరు యువకులు దొంగలుగా మారిన ఘటన చీరాల పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని పువ్వాడవారివీధిలో మువ్వల శివప్రసాద్ ఇంట్లో జరిగిన చోరీ ఘటన వివరాలను ఎఎస్‌పి విఠలేశ్వరరావు గురువారం వెళ్లడించారు. ఎఎస్‌పి చెప్పిన వివరాల ప్రకారం పట్టణంలోని నవాబుపేట ఆరో లైన్‌కు చెందిన షేక్ ఆజాద్, పటాన్ మున్నీర్ చోరికి పాల్పడ్డారు. నిందితులు ఇద్దరూ వివిధ బ్యాంకుల్లో, సోషల్ యాప్‌లలో ఒక్కొక్కరు రూ.8లక్షలు రుణాలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ రుణాల ఈఎంఐ ఒత్తిడి ఎక్కువ కావడంతో కట్టేందుకు డబ్బులు లేక ఏదైనా దొంగతనం చేసి కట్టాలనే ఆలోచనతో చోరీకి పాల్పడినట్లు తెలిపారు.
ఏ1 షేక్ ఆజాద్ అనే వ్యక్తి బాధితుడు శివప్రసాద్ ఇంటిలో కరెంటు పనిచేస్తూ సన్నిహితంగా ఉండేవాడని తెలిపారు. బిర్యానీ పాయింట్ నడుపుతున్న తన స్నేహితుడు మున్నీర్‌తో కలిసి చోరీ చేసేందుకు పథకం రచించారని తెలిపారు. చోరీ ఘటనపై సీఐ సుబ్బారావు సూచనలతో ఎస్‌ఐ రాజ్యలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. కొత్తపాలెం వద్ద నిందితుల గురువారం సంచరించినట్లు సిఐకి సమాచారం అందటంతో సిబ్బంది సాయంతో నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద 125 సవర్ల బంగారం, రూ.1.50 లక్షల నగదు మొత్తం రూ.1కోటి విలువైన సొత్తు, రెండు స్కూటీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదైన 24 గంటల్లోపు నిందితులను అరెస్ట్ చేయడంతోపాటు చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న సిఐ సుబ్బారావు, ఎస్‌ఐ రాజ్యలక్ష్మి, సిబ్బందిని ఎస్పీ తుషార్ డూడి అభినందించారు.