– క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మురళి
– మానవత్వం చాటి కాపాడిన జర్నలిస్టులు, పోలీసులు
– జేసిబి, గ్యాస్ కట్టర్ సహాయంతో కాపాడిన పోలీసులు
– అక్కాయిపాలెం టపాసుల గూడెం వద్ద ఘటన
చీరాల (Chirala) : జాతీయ రహదారిలో ఒకే మార్గంలో ప్రయాణిస్తున్న రెండు లారీలు ప్రమాదవశాత్తు ఒకదానిని ఒకటి ఢీ కున్నాయి. ప్రమాదంలో వెనుక లారీ డ్రైవర్ క్యాబిన్లో (Lorry Driver) ఇరుక్కుపోవడంతో రెండు గంటల పాటు శ్రమించి జేసిబి, గ్యాస్ కట్టర్ సహాయంతో సురక్షితంగా డ్రైవర్‌ను బైటకు తీసి వైద్యశాలకు తరలించారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చీరాల, ఒంగోలు జాతీయ రహదారిలో అక్కయ్యపాలెం జంక్షన్ సమీపంలోని టపాసుల గౌడౌను వద్ద జరిగింది. చీరాల నుండి ఒంగోలు వైపుకు ఓ లారీ వెళుతుంది. అదే సమయంలో కంకటపాలెం నుండి ఒంగోలు వైపుకు ధాన్యం బస్తాల లోడుతో మరో ఐషర్ లారీ వెళ్ళుతోంది.
టపాసులు గోడౌన్ వద్దకు రాగానే ముందు వెళుతున్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో ఆ వేగంకు క్యాబిన్ రోడ్డుపైకి వచ్చింది. అదే మార్గంలో ధాన్యం లోడుతో వెనుక ప్రయాణిస్తున్న లారీ ముందున్న లారీని ఢీ కొట్టింది. రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో వెనుక ఉన్న ధాన్యం లోడు లారీ నడుపుతున్న డ్రైవర్ మురళి క్యాబిన్‌లో ఇరుక్కుపోయి కొట్టు మిట్టాడుతున్నాడు. సమాచారం అందుకున్న జర్నలిస్టులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ మురళిని కాపాడేందుకు జర్నలిస్ట్ దిలీప్, వేటపాలెం ఎస్‌ఐ జనార్దన్ క్యాబిన్‌లో ఉన్న ఇనుప రాడ్లు తొలగించే ప్రయత్నం చేశారు.
డ్రైవర్ ఆర్తనాదాలు పెట్టడంతో అతనికి జర్నలిస్టులు, పలువురు త్రాగునీరు అందిస్తూ సపర్యాలు చేస్తూ ధైర్యం చెప్పారు. ఎంతకీ అవి రాకపోవడంతో గ్యాస్ కట్టర్, జెసిబి సహాయంతో రెండు గంటల పాటు శ్రమించి డ్రైవర్ మురళిని కాపాడారు. అనంతరం చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. మానవత్వం చాటి క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్‌ను సురక్షితంగా కాపాడిన జర్నలిస్టు దిలీప్, ఎస్‌ఐ జనార్దన్‌ను పలువురు అభినందించారు. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని అటుగా పయనిస్తున్న వాహనదారులు పోలీసులకు తెలపటంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






