అమరావతి : రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. ఆదివారం తాడేపల్లిలోని తన నివాసంలో వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలపై ఇరువురూ చర్చించారు. ప్రధానంగా ఖరీఫ్ లో రైతులందరికీ సకాలంలో పంట రుణాలు అందించేందుకు కృషి చేయాలని సుబ్బారెడ్డి కోరారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల ప్రయోజనం రైతులకు అందేట్లు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రకాశం జిల్లాలో 27,262మంది పొగాకు రైతులు 42,650హెక్టార్లలో సాగు చేసినట్లు వైవీ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో 21,227బ్యారన్లు ఉన్నట్లు తెలిపారు. ఒక్కో బ్యారన్ కు రెండు నుంచి మూడు లక్షల నష్టాన్ని చవిచూసే అవకాశమున్నట్లు పేర్కొన్నారు. జనవరిలో కురిసిన వర్షాలతో ఏ గ్రేడ్ రకం దిగుబడి తగ్గింది. దీనికితోడు లాక్‌డౌన్‌తో సకాలంలో వేలం కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో పొగాకు రంగుమారిపోయింది. మొత్తంగా రైతులు నష్టపోకుండా పండించిన పంట మొత్తాన్ని గిట్టుబాటు ధరలతో కొనేట్లు చర్యలు తీసుకోవాలి. నమోదు చేసుకున్న కంపెనీలన్నీ వేలంలో పాల్గొనేట్లు చేయాలి. దీనిపై ముఖ్యమంత్రితో మాట్లాడాను. రెండుమూడు రోజుల్లో సీఎంతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు అన్ని విధాలా న్యాయం చేస్తామని సుబ్బారెడ్డి మంత్రి కన్నబాబుకు వివరించారు.