– యువకుల సేవకు దేవరాజు స్పందన
– ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాల్లో హెచ్చరికల బోర్డులు
– ప్రమాదాల నివారణకు తనవంతు చేయూత
చీరాల : చీరాల – కారంచేడు ప్రధాన రహదారి గుంటతో ప్రమాదకరంగా మారింది. రోడ్డు నిర్వహణ బాధ్యతలు పట్టించుకోవాల్సిన ఆర్ అండ్ బి అధికారులు గాలికొదిలేశారు. వారం రోజుల క్రితం హైదరాబాద్ నుండి వస్తున్న కారు వేకువజామున గుంటలున్న విషయం తెలియక, వేగం నియంత్రణ కాక రోడ్డుపక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. ఘటనలో ఎవ్వరికి పెద్ద ప్రమాదం జరగలేదు. ఈ ఘటనను సిసి కెమేరాల్లో చూసిన చీరాల విజిలీపేట యువకులు స్పందించారు. అందరూ పలుగు, పారలు పట్టుకుని రోడ్డుపై గుంటలను మట్టితో పూడ్చారు. యువకుల సేవను గమనించిన చీరాల శ్రీకామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు స్పందించారు. తనవంతుగా ప్రమాదాల నివారణకు హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
అందుకు అనుగుణంగా శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు చీరాల, కారంచేడు రహదారిలో మంచినీటి చెరువు వద్ద రోడ్డుకి గుంతల ఉన్నాయి – వేగం తగ్గించుకుని వెళ్లాలని సూచిస్తూ బోర్డులను ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా దేవరాజు మాట్లాడుతూ యువకుల సేవాభావం తనకు ఆలోచన కలిగించిందని పేర్కొన్నారు. ప్రధాన రహదారిలో ఇటువంటి గుంతల వలన వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాద సూచికలు ఉంటే కొంతమేరకైనా ప్రమాదాలు నివారించినవారమవుతామని పేర్కొన్నారు. ఆర్ అండ్ బి అధికారులు స్పందించి రోడ్డుకు మరమత్తులు చేయాలని కోరారు. ఏఎస్ఐ స్వామి మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు నిర్వహించడంలో దేవరాజు ముందుంటారని అభినందించారు. తరచు ప్రమాదాలు జరిగే చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం ప్రమాదాల నివారణకు ఉపయోగపడతాయన్నారు. ఈకార్యక్రమంలో న్యూ విజిలిపేట యూత్ ఎన్ సత్య, ఎన్ చెందు, కె ఆర్య, వి గోపీ, వి గోవర్ధన్, ఎస్ ఇజ్రాయెల్, ఎ బద్రి, బి బాలు, ఎస్ సుదీర్, సిహెచ్ పండు, బి బన్నీ, కె ప్రవీణ్, పి పవన్, ఎన్ సన్నీ, డి బాలయ్య, శ్రీకామాక్షి కేర్ హాస్పిటల్ సిబ్బంది నరేంద్ర, మురళి, గోల్డ్ పాల్గొన్నారు.