Home ప్రకాశం మార్క్ ఫెడ్ రాకతో పొగాకు రైతులకు మంచిరోజులు

మార్క్ ఫెడ్ రాకతో పొగాకు రైతులకు మంచిరోజులు

335
0

– వరిలో వలే పొగాకులో కూడా కూలీల లేకుండా యాంత్రిక విధానం
– జాతీయ పొగాకు బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు
– టంగుటూరు పొగాకు వేలంకేంద్రాల సందర్శన
టంగుటూరు : పొగాకు కొనుగోలుకు ప్రభుత్వం రావడం ఆహ్వానించదగ్గ, అభినందనీయమైన నిర్ణయమని, దీనిద్వారా పొగాకు రైతులకు మంచి రోజులు వచ్చాయని జాతీయ పొగాకు బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు అన్నారు. టంగుటూరు పొగాకు వేలం కేంద్రం-1, 2ఫ్లాట్ ఫాంలను ఆయన తోపాటు ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, వైస్సార్ సీపీ ఇన్చార్జి, ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య శనివారం సందర్శించారు.

ఈ సందర్భంగా రఘునాథబాబు విలేకరుల సమావేశంలో రైతులనుద్దేశించి మాట్లాడుతూ పొగాకు రైతుల్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ను రంగంలోకి దించడం శుభపరిణామమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్క్ ఫెడ్ పొగాకు వేలంలో పాల్గొనే విధంగా తీసుకున్న నిర్ణయం రైతులకు ఎంతో మేలు చేస్తుందని కొనియాడారు. వేలంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేపట్టని కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ చేపట్టటం మంచి పరిణామమన్నారు. వేలంలో ప్రభుత్వ రంగ సంస్థ పొగాకు కొనుగోలు రంగంలోకి దిగడమంటే ఆషా మాషీ విషయం కాదన్నారు. దీని వల్ల వేలంలో పోటీ పెరుగుతుందని, మెరుగైన ధర ఇవ్వక వ్యాపారులకూ తప్పదన్నారు. 20శాతం ఉపయోగం ఉంటుందన్నారు. ఇబ్బందులు లేకుండా చూసుకుంటే ఈ విధానమే కొనసాగుతుందన్నారు. ఈ యేడు కూలీలకు ఎకరాకు రు.50వేలు ఖర్చు చేసినట్లు చెప్పారు. కరోనా వల్ల ఇతర రాష్ట్రాల వలస కూలీలు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోనున్నందున కూలీరేట్లు అధికంగా పెరగనున్నందున వరి తరహాలో పొగాకులో కూడా యాంత్రిక విధానాన్ని ప్రభుత్వం తీసుకురానున్నట్లు చెప్పారు. యాంత్రికమైన విధానాన్ని మొదటిగా వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రారంభిస్తామన్నారు. బావుంటే అందరూ అటువైపు మారవచ్చన్నారు. కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా పొగాకు వినియోగం తగ్గనున్నందున రైతులు పొగాకు పంట గణనీయంగా తగ్గించి సాగుచేయాలని రైతులను కోరారు.

మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ కొండెపి నియోజకవర్గంలో టంగుటూరు రైతులే 50శాతం పొగాకు పండిస్తున్నారని అన్నారు. వారికి సరైన గిట్టుబాటు ధర అందాలన్నారు. ఏడాదిలో అన్నివర్గాలకు సమప్రాధాన్యం కల్పిస్తూ జనరంజక పాలన అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతుల కోసమే మార్క్ ఫెడ్ ను రంగంలోకి దించారని అన్నారు. వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేసే పరిస్థితి వస్తుందన్నారు. ఇకపై వేలం కేంద్రాలకు వచ్చిన ఒక్క బేలు కూడా వెనక్కుపోదని అన్నారు. పొగాకు చివరి ఆకు వరకు మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. నవరత్నాల్లో ఒక రత్నంగా దశలవారీ మద్యనిషేధం అమల్లోభాగంగా మద్యవిమోచన ప్రచార కమిటీ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. రైతులు సహకరించాలని కోరారు. పీడీసీసీబీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంలో వర్షాలు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వర్షాలు విస్తారంగా కురుస్తూ ప్రజలు ఆనందంగా ఉన్నారని అన్నారు. దళారులు కుమ్మక్కై ధరలు తగ్గించడం జరిగిందన్నారు. ఇక నుండి అటువంటి పరిస్థితులు లేకుండా ముఖ్యమంత్రి రైతుల జీవితాలలో ఆనందం నింపడం కోసం రు.250కోట్ల నిధులు కేటాయించారని చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి పొగాకు రైతుల అభివృద్ధికి కోసం ఇటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కొండపి నియోజకవర్గంలో పొగాకు పండించే రైతులు 50 శాతం ఉన్నారన్నారని చెప్పారు. కార్యక్రమంలో వైస్సార్ సీపీ నాయకులు, సహకార సంఘ అధ్యక్షులు రావూరి అయ్యవారయ్య, ఏఎంసి వైస్ చైర్మన్ చింతపల్లి హరిబాబు, వైసీపీ మండల అధ్యక్షులు సూదనగుంట హరిబాబు, సూదనగుంట నారాయణ, చిడిపోతు సుబ్బారావు, రమణారెడ్డి, రంగారావు, పొగాకు వేలం కేంద్ర నిర్వాహకులు పాల్గొన్నారు.