గౌహతి : అస్సాం రాష్ట్ర తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ద్విపేన్ పాఠక్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాకు పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వ్యవహారశైలే కారణమని ఆరోపించారు. దీంతో మమత బెనర్జీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లైంది. అస్సాంలో జాతీయ పౌరుల జాబితా(ఎన్ఆర్‌సీ)లో అక్రమాలు జరిగాయంటూ మమత చేస్తున్న ఆందోళన, వ్యవహార శైలి వల్ల అస్సాంకు నష్టం జరుగుతుందని ద్విపేన్ పాఠక్ ఆరోపించారు.
అస్సాం శాసన సభలో టిఎంసికి ఏకైన ఎంఎల్ఎగా ఉన్న ద్వీపేన్‌సేన్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఎన్ఆర్‌సీపై మమత బెనర్జీ చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు. అస్సాంలో క్షేత్ర స్థాయి వాస్తవాలు ఆమెకు తెలియవన్నారు. తమ రాష్ట్రానికి వ్యతిరేకంగా తాను పని చేయలేనని పేర్కొన్నారు. టీఎంసీ విభజన రాజకీయాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ అస్సాంను విభజించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. బెంగాలీలను అస్సాం నుండి తరిమేయడానికే ఎన్ఆర్‌సీని తీసుకొచ్చినట్లు మమత బెనర్జీ చేస్తున్న ఆరోపణలతో తాను ఏకీభవించబోనని స్పష్టం చేశారు. ఇటువంటి ఆరోపణల వల్ల రాష్ట్రంలో అలజడి చెలరేగవచ్చున్నారు. అందుకు టీఎంసీ అధ్యక్షుడిగా ఉన్న తనపై నిందలు రావచ్చుని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే తన పదవికి రాజీనామా చేశానని ప్రకటించారు.