Home ఆధ్యాత్మికం Tirumala : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Tirumala : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

147
0

తిరుమల : సెప్టెంబ‌రు 18 నుండి 26వ‌ర‌కు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షించారు. ఆల‌యంలోని యాగశాలలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. పుట్ట‌మన్నులో న‌వ‌ధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.
విశిష్టత..
వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యత ఉంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలనే సంకల్పంతోపాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం.
సూర్యాస్తమయం తరువాతే..
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ చేస్తారు. జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని ‘సస్యకారక’ అంటారు. ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు. సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ చేస్తారు. అంకురార్పణంలో పలు పవిత్ర విత్తనాలు నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా జరుపబడతాయి.
అంకురార్పణ క్రమం..
పాలికలు అనే మట్టి కుండలలో విత్తనాలు నాటుతారు. యాగశాలలో జరిగే కార్యక్రమంలో అత్రి అనే మహర్షి తన ‘సముర్తార్చన అధికరణ’ అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు. అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు.

ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం చేస్తారు. సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ చేస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మ‌న్‌ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఎవి ధ‌ర్మారెడ్డి, జెఇఓ వీరబ్రహ్మం, సివిఎస్‌ఒ న‌ర‌సింహ కిషోర్‌, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో లోకనాధం పాల్గొన్నారు.