అద్దంకి (Dn5 News) : శింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి 71వ వార్షికోత్సవం తిరునాళ్ల రథోత్సవ బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు (VishnuvardhanRaju IPS)సోమవారం పరిశీలించారు. రథోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 40 మంది ఎస్‌ఐలతో కలిపి 650 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేవాలయ పరిసర ప్రాంతాల్లో 64 సీసీ కెమెరాలు, 6 బాడీ వోర్న్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు నిరంతరం పహారా కాసేందుకు 5 డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నట్లు తెలిపారు.
తిరునాళ్లలో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి తనిఖీ చేయడానికి 11 ఫింగర్ ప్రింట్ పరికరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ పరిశీలించేందుకు మరో 5 డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలు పూర్తిస్థాయిలో పరిశీలించారు. బందోబస్తు నిర్వహణపై సిబ్బందికి సూచనలు చేశారు. రథోత్సవం సందర్భంగా తోక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు. దేవాలయంలోని క్యూ లైన్‌ను పరిశీలించి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయో భక్తులను అడిగి తెలుసుకున్నారు. క్యూ లైన్‌లో భక్తులు దర్శనానికి వచ్చే విధానం, వెళ్లే విధానంపై పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. ప్రభల ఏర్పాటు జరుగుతున్న పార్కింగ్ ప్రదేశాలు పరిశీలించారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
తిరునాళ్లు, రథోత్సవానికి వచ్చి వెళ్లే భక్తులకు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తిరునాళ్లలో జేబుదొంగలు, సెల్‌ఫోన్ దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులు తమ పర్సులు, సెల్‌ఫోన్లను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించారు. మహిళలు బంగారు ఆభరణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎవరిపైనైనా అనుమానం వచ్చిన వెంటనే సమీపంలోని పోలీసు సిబ్బందికి సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. వాహనాల రద్దీని డ్రోన్ కెమెరాల ద్వారా అంచనా వేసి, అవసరమైతే హైవేపై ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేయాలని ఆదేశించారు.
ఇతర ప్రాంతాల నుంచి బంధుమిత్రులతో కలిసి ట్రాక్టర్లు, టాటా ఎసిలు, ఇతర వాహనాలలో వచ్చే భక్తులు పోలీసుల నిబంధనలు, దేవాలయ అధికారుల సూచనలు పాటించి సురక్షితంగా ఇంటికి చేరాలని విజ్ఞప్తి చేశారు. విధి నిర్వహణలో ఏ ఒక్క పోలీసు సిబ్బంది అలసత్వం వహించరాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ, ఎఆర్ డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, ఎస్‌బి సిఐ శ్రీనివాసరావు, అద్దంకి సిఐలు సుబ్బరాజు, మల్లికార్జునరావు, ఎస్ఐలు ఉన్నారు.






