నెల్లూరు : భార్య వేరొకరితో సన్నిహితంగా ఉండట తెలుసుకున్న భర్త ఆగ్రహించాడు. ఇద్దరినీ ఒకే ఇంటిలో చూసి తట్టులేకపోయాడు. అంతే భార్య, ఆమె ప్రియుడిని సజీవ దహనం చేశాడు. ఘటన గ్రామస్థులను భయబ్రాంతులకు గురి చేసింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం పంచాయతీ పరిధిలోని కోళ్లమిట్టలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రియుడు, ప్రియురాలు సజీవదహనమయ్యారు. పోలీసులు, గ్రామస్థులు చెప్పిన వివరాల ప్రకారం కోళ్లమిట్టకు చెందిన మడపాక హరిబాబు, కవిత(35)లకు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరిమద్య రెండేళ్ల క్రితం వివాదం చోటుచేసుకోవడంతో ఇద్దరూ వేర్వేరుగా జీవనం సాగిస్తున్నారు. పంటపాలెంకు చెందిన నన్నం శ్రీనివాసులు(37)కు కవిత ఇంటికి సమీపంలోనే పొలం ఉండటంతో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. రొయ్యల దళారీగా పనిచేస్తున్న శ్రీనివాసులు ఆమెకు అన్నీ సమకూరుస్తుండేవాడు. వీరిద్దరి సహజీవన విషయం తెలుసుకున్న హరిబాబు కొన్నినెలల క్రితం ఇద్దరితో ఘర్షణకు దిగాడు.
బుధవారం ఉదయం ఇద్దరూ ఇంట్లో ఉండటాన్ని గమనించాడు. ఇద్దరూ ఇంటిలో ఉండగా బయట నుంచి తాళం వేశాడు. అనంతరం అక్కడే నిలిపి ఉంచిన ప్రియుడు శ్రీనివాసులు ద్విచక్రవాహనంలోని పెట్రోలు తీసి ఇంటిపై పోసి నిప్పంటించాడు. మంటలు గమనించి లోపల ఉన్ననన్నం శ్రీనివాసులు, కవిత కేకలు వేశారు. కేకలు విన్న ఇరుగుపొరుగువారు అక్కడకు చేరుకున్నారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే హరిబాబు కర్రను చేతబట్టుకుని ఎవరూ రాకూడదంటూ బెదిరించాడు. బంధువులు, గ్రామస్థులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేయడంతో తప్పించుకుని పరారయ్యాడు. అప్పటికే పూరిల్లు పూర్తిగా కాలిపోయింది. లోపల ఉన్న శ్రీనివాసులు, కవిత సజీవ దహనమయ్యారు. మృతుడు శ్రీనివాసులుకు కుమారుడు, కుమార్తె ఉండగా మృతురాలు కవితకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఈ హఠాత్పరిణామంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. చుట్టుపక్కల ఇళ్లకు మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. నెల్లూరు గ్రామీణ డీఎస్పీ రాఘవరెడ్డి, సీఐ శ్రీనివాసరావు గ్రామానికి చేరుకొని విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.