Home ఆధ్యాత్మికం నేడు ‘మంత్రి గొట్టిపాటి’చే తిరునాళ్ల ప్రారంభం

నేడు ‘మంత్రి గొట్టిపాటి’చే తిరునాళ్ల ప్రారంభం

10
0

• నేటి నుండి శింగరకొండ తిరునాళ్లు
• మార్చి 1, 2 తేదీల్లో తిరునాళ్ల మహోత్సవం
• భక్తుల రద్దీకి తగిన ఏర్పాట్లు చేశామన్న అధికారులు
• ఆర్డిఓ కె ప్రసన్నలక్ష్మి సమన్వయంతో ఏర్పాట్లు
• వందల మంది పోలీసులతో బందోబస్తు
• భారీ ఎత్తున అన్నదాన ఏర్పాట్లు
అద్దంకి (DN5 News) : శింగరకొండ 71వ తిరుణాల మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం పాలక మండలి చైర్మన్ చుండూరి మురళి సుధాకరరావు, దేవస్థానం సహాయ కమిషనర్, కార్యనిర్వాహణాధికారి మదమంచి తిమ్మనాయుడు, పాలక మండలి సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా దేవస్థానం ఎదురుగా స్వామివారి ప్రత్యేక సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేయనున్నారు. స్వామి వారి దర్శనం చేసుకొని బయటకు రాగానే భక్తులకు ఉచితంగా లడ్డు ప్రసాదం అందించేందుకు టిటిడి నుండి ప్రత్యేక దిట్ట వంట చేయు సిబ్బంది ఈపాటికే దేవస్థానం వద్దకు చేరుకున్నారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, మజ్జిగ ప్యాకెట్స్, చిన్నపిల్లలకు పాలు అందించే ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఉచితంగా దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం ఎప్పటిలాగే నిర్వహిస్తామని అన్నారు.

28న గణపతి పూజాతో తిరునాళ్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చేతుల మీదుగా ప్రారంభం అవుతాయని తెలిపారు. ప్రారంభం సూచికంగా జ్యోతి ప్రజ్వలన చేసి స్వామివారికి పట్టు వస్త్ర సమర్పణ చేస్తారని తెలిపారు. 108 మంది వేద విద్యార్థులచే వేద పఠనం, స్వస్తితో పాటుగా శ్రీ హరి భక్త హనుమాన్ ప్రభు శిష్య బృందం ఇస్కాన్ వారిచే హరినామ సంకీర్తన జరుగుతుందని తెలిపారు. సాంస్కృతిక, నాటక ప్రదర్శన ఉంటామని తెలిపారు. మార్చి 1న ఆదివారం సుప్రభాత సేవతో ప్రారంభమై స్వామి వారికి విశేష అభిషేకం, తీర్థ ప్రసాద వినియోగాలు జరుగుతాయని అన్నారు. రాత్రికి భజన, కోలాట ప్రదర్శన, ఉష్ణ వాహన సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2న సోమవారం సుప్రభాత సేవతో ప్రారంభమై మన్యుసూక్త పారాయణ హోమం చేస్తారని తెలిపారు. విశేష అలంకరణతో స్వామివారి దివ్యదర్శనం నిర్వి రామంగా ఉంటుందని అన్నారు. రథోత్సవం, భజన, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 3న చంద్రగ్రహణం కారణంగా దేవాలయం మూసివేయనున్నట్లు తెలిపారు.

శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి క్షేత్ర వివరాలు
జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఒకటి. భక్తుల కోర్కెలు తీర్చే దేవుడిగా హనుమంతుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ క్షేత్రం విశిష్టత, చరిత్ర, ప్రాముఖ్యత గురించి విశ్లేషణాత్మక వివరణ

క్షేత్ర నేపథ్యం, విశిష్టత
​శింగరకొండ క్షేత్రం అద్దంకి సమీపంలో ఉంది. ఇక్కడి విశేషం ఏమిటంటే ఒకే చోట రెండు కొండలపైన, కింద వేర్వేరు దేవాలయాలు ఉండటం. ​కొండపైన పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది. ​కొండ కింద అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఉంది. ​సాధారణంగా నరసింహ స్వామి క్షేత్రాలకు క్షేత్రపాలకుడిగా ఆంజనేయుడు ఉంటాడు. కానీ ఇక్కడ హనుమంతుడికి ఉన్న విశేష ఆదరణ వల్ల ఇది ‘సింగరకొండ ఆంజనేయ స్వామి’ క్షేత్రంగానే ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. ​ఈ ఆలయానికి వెయ్యి ఏళ్లకుపైగా చరిత్ర ఉందని నమ్ముతారు.

​స్థల పురాణం – ​నిర్మాణం
త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాన్వేషణలో భాగంగా ఇక్కడ కొంతకాలం విడిది చేశారని, ఆ సమయంలో హనుమంతుడు ఈ కొండపై పహారా కాశారని భక్తుల నమ్మకం. 14వ శతాబ్దంలో రెడ్డి రాజుల కాలంలో ఈ ఆలయ అభివృద్ధి జరిగినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. దేవరాయలు కృష్ణదేవరాయల కాలంలో ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా వెలుగొందింది.

విగ్రహ రూపం, ఆధ్యాత్మిక విశ్లేషణ
​ఇక్కడి స్వామి విగ్రహం అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. ​అభయ ముద్ర స్వామి దక్షిణ ముఖంగా ఉండి, భక్తులకు అభయాన్ని ఇస్తున్నట్లుగా కనిపిస్తారు. పేరుకు తగ్గట్టే స్వామి వారు ఇక్కడ ‘ప్రసన్న’ (శాంత) రూపంలో ఉంటారు. అందుకే భక్తులు తమ కష్టాలను చెప్పుకుంటే వెంటనే తీరుతాయని నమ్ముతారు.

భవనాశి తటాకం (పుష్కరిణి)
​ఆలయం పక్కనే ఉన్న భవనాశి చెరువుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ​ఈ పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ​ఏడాది పొడవునా ఈ చెరువు నీటితో కళ కళలాడుతుండటం ఇక్కడి ప్రత్యేకత.

ప్రధాన ఉత్సవాలు
​హనుమత్ జయంతి ఇక్కడ అత్యంత వైభవంగా జరిగే వేడుక. రాష్ట్రం నలుమూలల నుండి లక్షల మంది భక్తులు తరలివస్తారు. ప్రతి శనివారం ఈ క్షేత్రం భక్తజన సందోహంతో నిండిపోతుంది. స్వామికి ఆకు పూజ, సింధూర పూజలు విశేషంగా నిర్వహిస్తారు. ​సింగరకొండ కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు అది ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. ప్రకృతి ఒడిలో కొండల మధ్య కొలువుదీరిన ఆంజనేయుడు భక్తుల పాలిట కల్పవృక్షంగా నిలుస్తున్నాడు.

దేవస్థానం ఆధ్వర్యంలో నిత్య అన్నదానం
ప్రసన్నాంజనేయ స్వామి కనుచూపులలో ఎందరో భక్తులు దూర ప్రాంతాల నుండి వచ్చిన వారి ఆకలి తీర్చే అభయ ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధిగాంచారని నమ్ముతారు. స్వామి దర్శనం అనంతరం దేవస్థానం ఆధ్వర్యంలో ఎంత మంది భక్తులు వచ్చినా అన్నదానం నిర్విరామంగా జరుపుతూనే ఉన్నారు. అనేక మంది భక్తులు నిత్యం అన్నదానం జరిపేందుకు ముందుకు వచ్చి తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు.

స్వామివారికి బంగారు కిరీటం
శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామికి చీరాల పట్టణం కొత్తపేటకు చెందిన ముప్పవరపు సుధీర్, ప్రత్యూష దంపతులు, వారి తల్లి సుధాకు చెందిన కుటుంబం రూ.1.10 కోట్ల విలువ చేసే బంగారు కిరీటం తయారు చేసేందుకు ఈపాటికే దేవస్థానం సహాయ కమిషనర్, కార్య నిర్వహణ అధికారి మదమంచి తిమ్మనాయుడుకు కొద్దిరోజుల క్రిందట బంగారాన్ని అందించారు. అది తుది మెరుగులు దిద్దుకుంటుంది. స్వామివారికి ఇంత భారీ మొత్తంలో విరాళం ఇవ్వడం మొదటిసారని చుట్టుప్రక్కల గ్రామాల భక్తులు చర్చించుకుంటున్నారు.

దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలు
దేవస్థానంలో జరిగే రాజగోపురాలు, ప్రాకార మండపాలు పునర్నిర్మాణానికి, వివిధ అభివృద్ధి పనులకు విరివిగా భక్తులు సహకరించి విరాళాలు అందజేయాలని పాలక మండలి చైర్మన్, కార్య నిర్వహణ అధికారి కోరారు. దేవస్థానం ఇప్పటికీ రాతి ముఖ మండపం రూ.7 కోట్లతో పూర్తిస్థాయిలో నిర్మాణం జరిగింది. దేవస్థానం మరింత అభివృద్ధి పరిచేందుకు నూతన రాజగోపురాల నిర్మాణాలు తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకు వచ్చారు. ఆలయ ప్రాకార మండపాల నిర్మాణం కోసం భక్తులు విరాళాలు ప్రకటిస్తూనే ఉన్నారు. ఇది పూర్తయితే భూమి ఉన్నంతవరకు ఈ దేవస్థానం చెక్కుచెదరదని భక్తుల విశ్వాసం.