అమరావతి : జగన్ కేంద్రంలో మోడీతో దోస్తీ కట్టి రాష్ట్రంలో అధికారపార్టీని ఆడిపోసుకుంటున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తుంటే అయ్యో పాపం. జగన్‌పై అబాండాలేస్తున్నారనుకున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం కష్టాల్లో పడ్డప్పుడల్లా జగన్ తీసుకునే నిర్ణయాలు చేస్తుంటే టిడిపి ఆరోపణలు నిజమే కదా? అనిపించేలా ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల నుంచి బీజేపీకి జగన్‌కు మధ్య బంధం ఎంత బలంగా రహస్యంగా సాగుతుందనేందుకు ఉదంతాలు నిరూపించాయి. కేంద్ర ప్రభుత్వానికి కష్టం వచ్చిన ప్రతిసారీ… మోడీ ఇబ్బంది ఎదుర్కొన్న అన్నిసార్లు జగన్ మోడీ పట్ల భక్తిని చాటుకున్నారు. ఆంద్రప్రదేశ్‌కు మోడీ సారధ్యంలోని కేంద్రం ప్రతిసారీ అన్యాయం చేస్తున్నా జగన్ మాత్రం ఏకపక్షంగా… బేషరతుగా మోడీకి అనుకూల నిర్ణయాలనే తీసుకుంటూ వచ్చారు. కనీసం మా రాష్ట్రానికి ఈ హామీ ఇస్తే మీ వెంటే ఉంటా అని కూడా డిమాండ్ చేయకుండా మోడీకి జగన్ వంతపాడిన తీరు ఆంధ్రులకు వైసిపిని దూరం చేసింది. చేస్తూనే ఉంది. అయినప్పటికీ జగన్ మాత్రం రాష్ట్రం కంటే తనకు తన కేసులు ముఖ్యం అనుకున్నారో ఏమో మోడీకి బలమైన మద్దతుదారుగా మారిపోయారు.
ఆంధ్రపై మోడీ ప్రస్తుతం కక్ష సాధింపు బహిరంగమైంది. ఏకంగా ఆంధ్రాకు హోదా ఇచ్చేదిలేదని, ఇవ్వాల్సినవి అన్ని ఇచ్చేసామని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ పై ఆంధ్రులు రగిలిపోతున్నారు. సాధారణ వ్యక్తులు సైతం బీజేపీ నేతలకు ఎదురెళ్లి నిరసనలు తెలుపుతున్నారు. నిరసన తెలిపే వారిపై బీజేపీ వ్యక్తులు దాడులు చేస్తున్నారు. కేంద్రమో ఎపినో – చంద్రబాబో మోడీనో అన్నట్లుగా హోరాహోరీగా టిడిపినేతలు తలపడుతున్నారు. అయినా సరే జగన్ మాత్రం రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయంపై నోరు విప్పడానికి కూడా సిద్దపడటంలేదు. తన ఎంపిలను రాజీనామా చేయించి చివరిదశలో ఉపయెన్నికలు నిర్వహిస్తే ప్రజాతీర్పు వస్తుందని చెబుతూ వస్తున్నారు.
ఎందుకు మోడీని ప్రశ్నించడం లేదంటూ టీడీపీ నేతలు సూటిగా జగన్, పవన్ లను అడుగుతున్నారు. అయితే వీరి నుండి రెస్పాన్స్ రావట్లేదు. అయితే హోదా ఇవ్వకున్నా, విశాఖ రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు, రెవెన్యూ లోటు, రాజధానికి నిధులు, వెనకబడ్డ ప్రాంతాలకు ఆర్ధిక సాయం ఇలా ఏ విషయంలోనూ మోడీ ప్రభుత్వం సహకరించకున్నా జగన్ మాత్రం మోడీకి అండగా నిలుస్తున్నారు. ఎన్డీయేలోని బీజేపీ మిత్రపక్షాలే మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే… జగన్ మాత్రం బేషరతుగా మోడీకి మద్దతు తెలిపి తన నిజస్వరూపం బయట పెట్టుకున్నారు.
మోడీ కోరికైన జమిలి ఎన్నికల విషయంలో కూడా వైసిపి… ప్రధానికి అండగా నిలిచింది. తనపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతోందని భావించిన మోడీ జమిలి ఎన్నికలను తెర మీదకు తెచ్చారు. మోడీ విసిరిన జమిలి వలలో ఇప్పుడు జగన్ ఇరుక్కున్నారు. ప్రధాని మోదీ ప్రతిపాదనకు వైసీపీ ఓటేసింది. జమిలి ఎన్నికలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలను తెలిపేందుకు మంగళవారం మధ్యాహ్నం ఆ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు లా కమిషన్‌ను కలిశారు.
జమిలి ఎన్నికలకు తమ పార్టీ మద్దతు ఇస్తునట్లు విజయసాయిరెడ్డి లేఖను లా కమిషన్‌కు అందజేశారు. లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధాని మోదీ ప్రతిపాదన కార్యరూపం దాల్చే పరిస్థితి కనిపించడం లేదు. జమిలి ఎన్నికలపై న్యాయ కమిషన్ రెండు రోజుల పాటు రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించింది. ఆ సమావేశాలకు కేవలం నాలుగు పార్టీలే మద్దతు ప్రకటించాయి. ప్రతిపక్షాల్లో కేవలం సమాజ్ వాదీ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, అకాలీదళ్, అన్నాడీఎంకేలు మాత్రమే మోడీ ప్రతిపాదనను సమర్థించాయి. ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఇతర పార్టీలేవీ జమిలి ఎన్నికల పట్ల సానుకూలంగా లేకపోవడంతో బీజేపీ వర్గాలు డీలా పడినట్లు కనిపిస్తోంది.
దేశవ్యాప్తంగా మోడీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతున్నట్లు వివిధ సర్వేలు చెబుతున్నాయి. అంతేకాదు నవంబరులో ఎన్నికలు జరిగితే మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ పరాజయం తప్పదని తేలడంతో జమిలి ఎన్నికలు నిర్వహించి నష్టనివారణ చర్యలు చేపట్టాలని బీజేపీ భావించింది. చంద్రబాబు సహా దేశములోని మెజారిటీ పార్టీలు జమిలిని వ్యతిరేకించాయి. అయినా ఇక్కడ జగన్, తెలంగాణలో కేసీఆర్ మాత్రం మోడీ నిర్ణయానికి సానుకూలంగా స్పందించారు. మోడీ విషయంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వైసిపి కేడర్ ను నిరాశకు గురిచేస్తున్నాయి.