Home బాపట్ల నేతన్నల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

నేతన్నల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

11
0

•నేతన్నలకు కూటమి ప్రభుత్వ శుభవార్త
•ఏప్రిల్ 1 నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్
•నాలుగు లక్షల కుటుంబాలకు లబ్ధి
•ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
పర్చూరు (Parchuru) : రాష్ట్రంలో చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న నేతన్నల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (MLA Yeluru Sambashivarao) అన్నారు. చేనేత రంగాన్ని ఆదుకునే దిశగా ఏప్రిల్ 1 నుంచి మగ్గాలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం కింద హ్యాండ్లూమ్‌ (చేనేత మగ్గం)లకు (Handlooms) నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌ (మర మగ్గాలు)లకు (PowerLooms) 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు తెలిపారు.

ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మంది నేతన్నల కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుందని అన్నారు. విద్యుత్ చార్జీలు భారంగా మారడంతో గత కొన్నేళ్లుగా చేనేత రంగం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొందని అన్నారు. ఆ పరిస్థితిని నుండి నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేందుకే సిఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandra babu Naidu) నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు.

ఈ పథకం అమలుతో ప్రభుత్వంపై ఏడాదికి రూ.85 కోట్ల మేర ఆర్థిక భారం పడినా, నేతన్నల భవిష్యత్తు దృష్ట్యా ఆ భారాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నేతన్నలకు సామాజిక భద్రత కల్పించే దిశగా 50 ఏళ్ల వయసు నుంచే నెలకు రూ.4వేల పెన్షన్ ఇస్తున్నామని గుర్తు చేశారు. చేనేత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నేతన్నల జీవితాల్లో ఆశాభావం నింపేలా తీసుకున్న ఈ నిర్ణయం చేనేత రంగానికి నూతన ఉత్సాహం తీసుకువస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో చేనేత రంగ అభివృద్ధి, నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.