Home బాపట్ల రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షం

రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షం

11
0

ఇంకొల్లు (DN5 News) : దేశానికి అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉంటేనే సమాజం సంతోషంగా, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. రైతు సంక్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వాలు చరిత్రలో నిలవలేవని అన్నారు. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తూ సంక్షేమ పధకాలు అమలు చేస్తోందని తెలిపారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ ద్వారా పెట్టుబడి సాయం విడతల వారీగా అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రెండు విడతల్లో రూ.6,309 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ప్రస్తుతం 3వ విడత నిధులు పీఎం కిసాన్ పథకం నిధులతో కలిపి రూ.6వేలు రైతులకు జమ చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఆర్థిక బలం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని అన్నారు. నియోజకవర్గంలో రైతులకు ఈ పథకాల ద్వారా గణనీయమైన సాయం అందిందని పేర్కొన్నారు. 37,861 మంది రైతు కుటుంబాలకు రూ.22.90 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయని తెలిపారు.

సాగు రంగానికి ప్రాధాన్యం
రైతులకు అవసరమైన ఎరువులు సబ్సిడీ ధరలపై ఎలాంటి కొరత లేకుండా అందిస్తున్నామని చెప్పారు. కేంద్రంతో నిరంతరం సమన్వయం చేస్తూ ఎరువుల సరఫరా కొనసాగిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ యంత్రాలు రాయితీలపై అందించి సాగులో సాంకేతికత ప్రోత్సహిస్తున్నామని అన్నారు.

సాగునీటి ప్రాజెక్టులకు వేగం
గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి లోనైన ప్రాజెక్టులు పునరుద్ధరించి సాగునీటి సరఫరా మెరుగు పర్చేందుకు తమ ప్రభుత్వం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పనులు వేగవంతం చేసి త్వరలో పూర్తి చేసేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకువచ్చి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నట్లు తెలిపారు.

లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరణ
ఎన్‌ఎస్‌పీ కాలువలను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసి సాగునీటి సరఫరా మెరుగుపరిచామని తెలిపారు. గతంలో రూ.100 కోట్లతో కాలువల అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. నిలిచిపోయిన 55 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు పునరుద్ధరించి, కొన్ని ప్రైవేట్ లిఫ్ట్‌లను నడిపిస్తూ నీటిని అందుబాటులోకి తెచ్చామని అన్నారు.

రైతు పంటలకు మద్దతు
పంటలకు మార్కెట్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఈ ప్రక్రియకు నెలల తరబడి ఆలస్యం జరిగేదని విమర్శించారు. నల్ల బర్లీ పొగాకు రైతులను ఆదుకునేందుకు రూ.275 కోట్ల విలువైన పంట కొనుగోలు చేసినట్లు తెలిపారు. శనగలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించామని, మొక్కజొన్న రైతులకు అండగా ఉంటామని పేర్కొన్నారు.