Home బాపట్ల తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలం

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలం

9
0

– పార్టీ బలోపేతానికి పటిష్టమైన వ్యవస్థ అవసరం
– యువగళం ఏపీ రాజకీయాల్లో గేమ్‌చేంజర్
– తెదేపా పార్లమెంట్ కమిటీ శిక్షణా తరగతుల్లో ఎమ్మెల్యే ఏలూరి
పర్చూరు : తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసే కార్యకర్తలే పార్టీకి ప్రాణమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కమిటీ శిక్షణా తరగతులలో ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం కావాలంటే జిల్లా స్థాయి నుంచే పటిష్టమైన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పార్టీకి ఒక సైన్యాధిపతి లాంటివాడని పేర్కొన్నారు. కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ముందుకు సాగాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్యే ఉండాలని, ప్రజల సమస్యలే మన అజెండాగా ఉండాలని కోరారు.

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల జీవన స్థితిగతులను గణనీయంగా మారుస్తున్నాయని అన్నారు. గత ఐదేళ్ల అస్తవ్యస్త పాలన కారణంగా సరైన రహదారులు, మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. నాటి ప్రభుత్వాల తప్పిదాల వల్లే నేడు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. పరిపాలనా దక్షత కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆ సమస్యలను క్రమంగా పరిష్కరిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.

రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడే రాష్ట్రానికి అవసరమని అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ స్పష్టమైన దృష్టితో పాలన సాగిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే శక్తి ఆయన నాయకత్వానికే ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు.

మంత్రి నారా లోకేష్ పనితీరు ప్రజల్లో విశేష ఆదరణ పొందుతోందని తెలిపారు. యువ నాయకుడిగా ఆధునిక ఆలోచనలతో ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వరకు తీసుకెళ్లడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.

యువగళం పాదయాత్రకు నేటితో మూడు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే ఏలూరి పాల్గొన్నారు. యువగళం పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో గేమ్‌చేంజర్‌గా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజాచైతన్యమే లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగిందని గుర్తుచేశారు.

2023 జనవరి 27న కుప్పం నియోజకవర్గంలోని వరదరాజస్వామి సన్నిధిలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్లు కొనసాగిందని తెలిపారు.

సోషల్ మీడియా, ప్రత్యక్ష కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని సూచించిన ఎమ్మెల్యే, 2029 ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకొని ప్రతి బూత్‌ను బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సహా పలువురు పార్టీ నేతలు, జిల్లా అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.