వేటపాలెం (Vetapalem) : వాస్తవాలు పదిలం, చరిత్రలకు సజీవ సాక్ష్యం గ్రంథాలయమని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. వేటపాలెం సారస్వత నికేతనం గ్రంథాలయం సోమవారం సందర్శించారు. 1918లో స్థాపితమైన సారస్వత నికేతనం గ్రంథాలయం తెలుగు, సంస్కృతం, హిందీ భాషల్లోని తాళపత్ర గ్రంథాలు, అరుదైన వ్రాతప్రతులు, పాత పుస్తకాలతో కూడిన అద్భుతమైన సేకరణను పరిశీలించారు.
దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన గ్రంథాలయం అన్నారు. పురాతన గ్రంథాలయాల్లో ఒకటిగా పేరొంది చరిత్రకు ఆధారంగా వేటపాలెం గ్రంధాలయం నిలిచిందని అన్నారు. గ్రంధాలయంలో ప్రస్తుతం 90వేలకుపైగా వాల్యూమ్‌లు భద్రపర్చినట్లు తెలిపారు. మహాత్మా గాంధీ 1929లో గ్రంథాలయాన్ని సందర్శించి శంకుస్థాపన చేసినట్లు గుర్తు చేశారు. ఈ సంస్థకున్న చారిత్రక ప్రాధాన్యత చాటుతోందని అన్నారు. ఆయన వెంట ఎఎంసి చైర్మన్ కౌతరపు జనార్ధన్, టిడిపి పట్టణ అధ్యక్షులు దోగుపర్తి బాలకృష్ణ పాల్గొన్నారు.






