– నేటికీ వెంటాడుతున్న గత పాలకుల పాపాలు
– శాసన సభలో ఎంఎల్‌ఎ కొండయ్య
చీరాల (DN5 News): ఇటీవల బీభత్సం సృష్టించిన మొంథా తుఫాన్ కారణంగా మత్స్యకార గ్రామాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నట్లు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య (Chirala MLA Kondaiah) శాసన సభ దృష్టికి తెచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన తనదైన శైలిలో చీరాల తీర ప్రాంత సమస్యలపై గురువారం గళం విప్పారు. గత పాలకులు వారి స్వలాభాలూ చేసుకున్నారని, ప్రజాభివృద్ధిని గాలికి వదిలారని అన్నారు. రోడ్ల అభివృద్ధి లేదు. పర్యాటకంపై దృష్టి సారించలేదు.
ఈ క్రమంలో ఇటీవల తుఫాను కారణంగా 8 కల్వర్టులు పూర్తిగా దెబ్బతిని మత్స్యకార గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు పర్యాటక రంగం కుదేలైనట్లు సభ దృష్టికి తీసుకువచ్చారు. తుఫాను నీటిని తొలగించేందుకు సుమారు 20 రోజులు పట్టిందని అన్నారు. ఒంగోలు జడ్పీ నిధుల నుండి తాత్కాలిక కల్వర్టులు ఏర్పాటు చేశామన్నారు. అయితే శాశ్వత పరిష్కారాలకు వంతెన నిమిత్తం సుమారు రూ.8 కోట్లకు ప్రతిపాదనలు పంపగా అవి పెండింగ్లో ఉన్నాయని అన్నారు. వెంటనే తీర ప్రాంత సమస్యలకు శాశ్వత పరిష్కారం ప్రభుత్వం చూపాలని సభలో కోరారు.






