బాపట్ల (DN5 News) : నియోజకవర్గలో రైతులు సాగునీరు, మురుగునీటి సమస్యలతో పంటలు నష్టపోకుండా సాగు, మురుగు నీటి పారుదల వ్యవస్థ మెరుగుపరచాలని శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ స్పష్టం చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ (పి4) కార్యాలయంలో ఇరిగేషన్, డ్రైనేజీ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. రైతు సంక్షేమం దృష్ట్యా పంట కాలువల్లో పూడికతీత, మురుగు కాలవల్లో గుర్రపు డెక్క ఇతర మరమత్తు పనులకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. సాగు, మురుగు నీటి పారుదలకు అవసరమైన మరమ్మత్తులు చేపట్టేందుకు అంచనాలు తయారు చేయాలని అధికారులను కోరారు. గతంలో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.
కాలువల్లో సమస్యలు గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు అవసరమైన అంచనాలు తయారు చేయాలని సూచించారు. రానున్న వేసవి దృష్ట్యా గ్రామాలతో పాటు పట్టణంలో త్రాగునీటి ఎద్దడిని సమర్ధంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. అవసరమైన ప్రాంతాల్లో కాల్వల్లో పూడి తీత, జంగిల్ క్లియరెన్స్ వంటి పనులు త్వరితగతిన చేపట్టాలని సూచించారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో అత్యవసర మరమ్మతులకు ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చిస్తోందని అన్నారు. సమావేశంలో డ్రైనేజీ బాపట్ల, చీరాల, పొన్నూరు సబ్ డివిజన్ డిఈలు ధనలక్ష్మి, ఎన్‌కెవి ప్రసాదరావు, నరేంద్రబాబు, ఎఇలు జి వెంకటరమణ, నీలిమ, ఎఈఈ కె రామమూర్తి, ఎఈ సిహెచ్ రవీంద్రబాబు, జాగర్లమూడి ఎఈఈ కె శ్రీనివాసరావు, చీరాల ఎఈ వనజ, ఎఈఈ కె విజయ్ పాల్గొన్నారు.






