– కందులూరు, యరజర్ల గ్రామాల్లో పోలీసులు, అధికారుల మోహరింపు, ఉద్రిక్తత
టంగుటూరు : ఒంగోలు శివారుప్రాంతమైన కందులూరు, యర్రజర్ల గ్రామాల మధ్యలోని కొండప్రాంతంలో కరోనాతో చనిపోయిన వారిని ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. రిమ్స్ లో చికిత్స పొందుతూ కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలను ప్రభుత్వ భూమిలో పూడ్చిపెట్టాలని బుధవారం రాత్రి అంబులెన్స్ లో తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న కందులూరు, యర్రజర్ల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అధికారుల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అసలే కరోనా భయంతో తల్లడిల్లిపోతుంటే ఏకంగా కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను తమ నివాసాల సమీపంలో అందులోను కందులూరు గ్రామానికి మంచినీటి చెరువుకు దగ్గరలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా అదే ప్రాంతంలోనే ఒంగోలు ప్రాంత ప్రజలకు షుమారు 22వేల మందికి నివేశ స్థలాల పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో స్థలాలు కేటాయించారని అధికారులకు ప్రజలు గుర్తు చేశారు. అటువంటి ప్రాంతంలో కరోనా మృతదేహాలను పూడ్చి పెట్టడం ఏమిటని రెండు గ్రామాల ప్రజలు మృతదేహాన్ని తీసికువచ్చిన అంబులెన్స్ ను, అధికారుల వాహనాలను అడ్డుకున్నారు.
మృతదేహాన్ని ఇక్కడ పూడ్చిపెట్టొద్దని, దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్లి ఖననం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒంగోలు, టంగుటూరు తహసీల్దార్లు చిరంజీవి, ఉష, ఇతర పోలీసు సిబ్బంది నచ్చచెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రజలు శాంతించకపోవడంతో మృతదేహాన్ని తిరిగి ఒంగోలుకి తరలించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం టంగుటూరు, ఒంగోలు పోలీసులు మరోసారి ప్రభుత్వ భూమిని పరిశీలించేందుకు అక్కడికి చేరుకున్నారు. మళ్ళీ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ఐదు గ్రామాల ప్రజలు కోపోద్రుక్తులై పోలీసు వాహనాన్ని చుట్టుముట్టారు. ఒక సందర్భంలో ఆందోళనకారులు పోలీస్ వాహనాన్ని సైతం ప్రక్కకు నెట్టే ప్రయత్నం చేశారు. అక్కడ తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. సాయంత్రం కరోనా నియంత్రణ, ఇతర అధికారులు సమావేశం కానున్నట్లు తెలిసింది. జిల్లా మంత్రి ఆదేశానుసారం మృతదేహాలను ఖననం చేసే విద్యుత్తు యంత్రాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధపడినట్లు తెలిసింది. ఐతే యంత్రం జిల్లాకి వచ్చే సరికి ఒక వారమైనా పడుతుంది కనుక కరోనా మృతదేహాల ఖననం కార్యక్రమం ఎక్కడ పూర్తి చేయాలనే అంశాన్ని సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని ఆయా గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు.