Home బాపట్ల నేడు కౌలు రైతులు నిరాహార దీక్షలు

నేడు కౌలు రైతులు నిరాహార దీక్షలు

17
0

• 30గంటలపాటు నిరవధిక దీక్షలు
• భూ యజమానితో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలి
• కౌలు రైతులకు పెట్టుబడి సాయం రూ.20వేలు ఇవ్వాలి
• భూమి లేని పేద కౌలు రైతులను గుర్తించాలి
• మొంథా తుఫాను నష్టపరిహారం ఇవ్వాలి
బాపట్ల (DN5 News) : ఈనెల 23, 24 తేదీల్లో కౌలు రైతులు బాపట్ల కలెక్టర్‌ కార్యాలయం వద్ద 30 గంటలు నిరాహార దీక్షలు చేయనున్నట్లు కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి కొండయ్య తెలిపారు. వ్యవసాయంలో 70 శాతం మందిపైగా కౌలు రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయం గిట్టుబాటు కాక భూమి సొంతదారులు ఎప్పుడో వ్యవసాయాన్ని వదిలివేశారని, గిట్టుబాటు ధరలు రాక, పెట్టుబడి ఖర్చులు పెరిగి కౌలు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యల బాట పడుతున్నారని తెలిపారు. గత మూడేళ్లుగా మిర్చి సాగు చేసిన రైతులు దివాలా తీశారని పేర్కొన్నారు. గతేడాది పొగాకు రైతుల నుండి ప్రభుత్వం చివర కాడ వరకు కొంటామని చెప్పి 50 శాతం కూడా కొనలేకపోయిందని ఆరోపించారు. నేటికీ గ్రామాల్లో పొగాకు బోదెలు దర్శనమిస్తున్నాయని తెలిపారు.

రూ.18 వేలు అమ్మిన పొగాకు రూ.6వేల నుండి 9వేలకు ప్రభుత్వం కొంత భాగమే కొనుగోలు చేసిందని తెలిపారు. ఎకరాకు రూ.50 వేలు తక్కువ కాకుండా కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వాణిజ్య పంటలు తీవ్రంగా ముంచి వేశాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మొండి చేయి చూపించడం తప్ప ఏ మాత్రం ఆదుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. కౌలు రైతు పరిస్థితి మరీ దారుణంగా ఉందని అన్నారు. అన్నదాత సుఖీభవ సాగు చేస్తున్న కౌలు రైతు కాకుండా భూ యజమానికి చెందుతుదని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, విత్తనాలు భూ యజమానికే దక్కుతున్నాయని తెలిపారు. వాస్తవ సాగు రైతులను ప్రభుత్వం గుర్తించడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సహాయం రూ.6వేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14వేలు కలిపి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతు ఖాతాలో జమ చేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6వేలు పథకం ప్రారంభమై ఆరేళ్లైనా ఒక్క పైసా పెంచలేదని తెలిపారు.

ఈ బడ్జెట్‌లోనైనా పెంచుతారని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైందని తెలిపారు. పంట ఉత్పత్తి ఖర్చులకు రెట్టింపు చేసి కనీసం మద్దతు ధర నిర్ణయించాలని స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సులు బుట్ట దాఖలు అయ్యాయని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు కొత్త కౌలు చట్టం తీసుకువస్తామని చెప్పిన మాటలు ఆచరణకు నోచుకోలేదని అన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడం అంటే కౌలు రైతులను పట్టించుకోకుండా నేడున్న స్థితిలో వ్యవసాయం ముందుకు వెళ్లదని తెలిపారు. తక్షణం నూతన కవులు చట్టం తీసుకురావాలని కోరారు. భూ యజమానితో నిమిత్తం లేకుండా కౌలు కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించారు.

స్కేల్ ఆ ఫైనాన్స్ ప్రకారం అవసరమైన రుణ సదుపాయం కల్పించాలని, భూమిలేని కౌలు రైతులను గుర్తించి ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయ పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలు కట్టలేక దివాళా తీస్తున్నారని తెలిపారు. కౌలు దోపిడీ, వడ్డీ దోపిడీ, మార్కెట్ దోపిడీలతో దిక్కు తోచక అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలంటే కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా నూతన కౌలు చట్టం తీసుకురావాలని, కౌలు రైతులకు పంట రుణాలు, పంటల బీమా, పంట నష్టపరిహారం అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ డిమాండ్ల సాధన కోసం ఈనెల 23, 24 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతులు దీక్షకు పూనుకున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కౌలు రైతులకు ఉపయోగపడే విధంగా కౌలు చట్టం తేవాలని కోరారు. ఇటీవల సంభవించిన మోంథా తుఫానుకు కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించి కేంద్రాన్ని సహాయం అడిగిందని, మన జిల్లాలో 12,790 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని నివేదికల్లో చెప్పినప్పటికీ ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వనేలేదని తెలిపారు.