– టీచర్లకు కరోనా విధుల విరామం ఎప్పుడు?
– ఆంగ్ల మాధ్యమం శిక్షణకు హాజరయ్యేది ఎలా?
– కరోనా విధుల పేరుతో మద్యం దుకాణాల వద్ద కాపలా నా?
ఉపాధ్యాయులను కోవిడ్ నియంత్రణకు పారా పోలీసులుగా నియమించారు. లాక్‌డౌన్ విధించిన అప్పటి నుంచి ఉపాధ్యాయులు కూడా కరోనా విధులు నిర్వహిస్తున్నారు. మొదటి విడత లాక్ డౌన్ సమయంలో 2వేల మంది ఉపాధ్యాయులకు విధులు కేటాయించారు. గత నెల 16న వీరిని రిలీవ్ చేసి రెండో లాక్ డౌన్ సమయంలో మరో 2వేల మందికి విధులు కేటాయించారు. పోలీసులకు సైతం పది రోజులకు విరామం ఇస్తున్నప్పటికీ ఉపాధ్యాయులకు మాత్రమే 20 రోజులు గడిచినా విరామం ఇవ్వడం లేదు. రెండో విడత కరోనా విధుల్లో చేరిన ఉపాధ్యాయులకు మే 3 నాటికి 20 రోజులు కావస్తున్నది. గడువు మించిన ప్పటికి వీరిని రిలీవ్ చేయడం లేదు.
మరోవైపు విద్యాశాఖ మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు ఉపాధ్యాయులకు ఆన్లైన్ లో శిక్షణ నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఆన్లైన్లోనే పరీక్షలు రాసి అనుమతి పొందాల్సి ఉంది. అలాంటి ఉపాధ్యాయులను కరోనా విధుల నుండి మినహా ఇంత కుండా ఆంగ్ల మాధ్యమ శిక్షణ ఎలా సాధ్యమవుతుందని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. నాలుగు రోజులు నుంచి జిల్లా ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్న స్పందన లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం విధుల్లో కొనసాగాలని గాని, కొత్త బ్యాచ్ నియామకం గాని చేయడం లేదు. వాస్తవానికి 10రోజులు డ్యూటీ చేసిన తర్వాత విరామం ఇవ్వాల్సి ఉంది. రెండో విడతలో చేరిన వారు ఈపాటికే 20 రోజులు కావస్తోంది. ఆరోగ్య సమస్యలు మొదలు అయ్యాయి. పోలీసు శాఖలో అయితే 10 రోజుల తర్వాత రిలీవ్ చేస్తున్నారు. కానీ ఉపాధ్యాయులకు ఈ అవకాశం ఇవ్వడం లేదు.
మే 4 నుండి మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడంతో కరోనా చెక్పోస్టుల వద్ద విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు కూడా మద్యం దుకాణాలకు వచ్చే వారిని నియంత్రించాల్సిన బాధ్యత కూడా వీరిపై రావడం ప్రభుత్వ చర్యల పై విమర్శలకు కారణమయ్యింది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద మందుబాబుల ను నియంత్రించే పని లో పెట్టడం ఏమిటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి ఈ విధుల నుండి ఉపాధ్యాయులను మినహాయించాలని కోరుతున్నారు.