అమరావతి : ముందస్తు ఎన్నికలు రావచ్చు. ఒకవేళ రాకున్నా మరో ఆరు నెలల్లోనో ప్రజా తీర్పుకు జనంలోకి వెళ్లాల్సిందే. గడిచిన నాలుగున్నరేళ్ల ప్రభుత్వ పని తీరుపైన… సకల వర్గాలను మెప్పించేలా ప్రచారం చేయాలి. చేసిన పాలనపైన ప్రజలు తమ తీర్పు చెప్పే సమయం ఆసన్నమైంది. అంతా తమకు అనుకూలంగా వున్నా చేసింది చెప్పుకోవాల్సిందే. అందుకే టిడిపి ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ఒకవైపు ప్రభుత్వ పరంగా.. మరోవైపు పార్టీ పరంగా ఈ ఆరునెలలు జనంలోనే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ‘‘నవ్యాంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 16వ తేదీకి 1500ల రోజులు పూర్తవుతుంది. దీన్ని పురస్కరించుకుని ఆరు నెలల పాటు గ్రామదర్శిని, గ్రామ వికాసం కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని సందర్శించాలి. మనం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రచార ఉద్యమం చేపట్టాలి. సమస్యలనూ పరిష్కరించాలి. మనది బాధ్యతాయుత ప్రభుత్వం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, కలెక్టర్లు, కార్యదర్శులు, శాఖాధిపతులకు తెలిపారు.
గ్రామ దర్శిని, గ్రామ వికాసం కార్యక్రమంలో వచ్చే సమస్యలను జనవరిలో నిర్వహించే జన్మభూమి గ్రామ సభల్లో పరిష్కరిస్తామన్నారు. 1994లో ప్రారంభించిన డ్వాక్రా ఉద్యమానికి ఈ ఏడాదికి 25 ఏళ్లు పూర్తవుతున్నందున రజతోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాలో కేన్సర్ ఆసుపత్రులను పెట్టాలని, ఇప్పటికిప్పుడు భవనాల నిర్మాణం సాధ్యం కానందున, పీపీపీ పద్ధతిలో ప్రారంభించాలని సూచించారు. పాఠశాల పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం ఏటా జరిగే పనే అని, అది కూడా సకాలంలో చేయకుంటే ఎలా అని సీఎం ప్రశ్నించారు. ‘‘మనందరం నాలుగేళ్లుగా ప్రతికూల పరిస్థితుల్లోనూ కష్టపడి ఫలితాలు సాధించాం. తొలిదశలో ఇబ్బందులొచ్చినా తర్వాత పరిస్థితి చాలా బాగుంది. రోజూ ఇక్కడే ఉండి చూస్తేవచ్చిన మార్పు తెలియడం లేదు. బయటినుంచి వచ్చినవారు ఇన్ని సీసీరోడ్లు, పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ భవనాలు ఇవన్నీ ఎప్పుడయ్యాయా అని ఆశ్చర్యపోతున్నారు’’ అని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ‘గ్రామదర్శిని’ కార్యక్రమాన్ని పార్టీగానే నిర్వహించాలని అధినేత చంద్రబాబు నిర్ణయించారు. శుక్రవారం కొందరు టీడీపీ ఎమ్మెల్యేలతో భేటీ సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు ప్రతి గ్రామానికీ వెళ్లి ప్రజలు, పార్టీ కార్యకర్తలతో భేటీ కావాలన్నారు. రచ్చబండ నిర్వహించాలన్నారు. వివిధ పథకాల అమలుపై సమీక్షించాలని చెప్పారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే తెలుసుకోవాలని సూచించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడానికే ఈ కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. దీనికి అధికారులతో కలిసి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. గ్రామాలకు వెళ్లినప్పుడు ఉపన్యాసాలు చెప్పి రావడం కాకుండా అక్కడ నాలుగైదు గంటలు గడిపి ప్రజలు, కార్యకర్తల బాగోగులు, స్థానిక రాజకీయ పరిస్ధితులు తెలుసుకొని రావాలని హితవు పలికారు. ”
ఎన్నికలు ఏ సమయంలో వచ్చినా మనం సన్నద్ధంగా ఉండాలి. కేడర్‌ను ఉత్సాహపరచాలి. సమస్య లేమైనా ఉంటే పరిష్కరించుకోవాలి. ప్రజల్లో ఉండి వారి అభిమానం చూరగొంటే మన గెలుపును ఎవరూ ఆపలేరు. వారిమధ్య ఉండేందుకు ప్రాధాన్యం ఇవ్వండి” అని చంద్రబాబు ఉద్భోదించారు. మూడు నెలల్లో గ్రామదర్శిని కార్యక్రమం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. నియోజకవర్గ విస్తృతిని బట్టి షెడ్యూల్ తయారుచేసుకుని పనిచేయాలని సూచించారు. అంగన్‌వాడీలు, హోం గార్డులు, వీఆర్వోలు, ఆశా వర్కర్లు వంటి చిరుద్యోగుల వేతనాలు పెంచుతూ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయన్నారు. వారంతా తమను కలిసి ప్రభుత్వ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి చెప్పారు. పథకాలు చాలా అమలు చేస్తున్నామని, వాటి అమలు తీరుపై క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి సమస్యలుంటే తనకు సమాచారం ఇవ్వాలని, వాటిని పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.