ఒంగోలు : పోలవరంపై ఆంధ్ర ప్రజల ఆశలను జగన్మోహన్ రెడ్డి అడియాసలు చేస్తున్నారని, పోలవరం నిర్మాణంలో ఎత్తు తగ్గించి ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారని, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. పోలవరాన్ని ఆమోదించిన డిజైన్ ప్రకారమే చేయాలని కేంద్ర జల సంఘం ఆదేశాలు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి వాటిని పెడచెవిన పెడుతున్నారని విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 150అడుగులు, కనీస నీటిమట్టం 135అడుగులు కానీ జగన్మోహన్రెడ్డి సర్కార్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టాన్ని 135అడుగుల కుదిస్తూ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారని, ఇది ముమ్మాటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు తీరని నష్టం చేకూరుస్తుందని అన్నారు. దీనివలన తెలంగాణలో గోదావరి నది మీద తెలంగాణ ప్రభుత్వం మరొక ఆనకట్ట నిర్మించడానికి అవకాశం ఉందని, ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అని ధ్వజమెత్తారు.
తెలంగాణ సర్కార్ కు ప్రయోజనం చేకూర్చే విధంగా పనిచేసే కేంద్ర జల శాఖ సలహాదారు వేదిరే శ్రీ రామ్ రెడ్డి, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఆయన సతీమణి శిల్పారెడ్డిలు పోలవరం ఎత్తు తగ్గించే విషయంలో జగన్మోహన్రెడ్డికి సూచన ఇస్తున్నారని, వీరిద్దరూ తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని అన్నారు. అన్ని అనుమతులు పొందిన తరువాత ఇప్పటికిప్పుడు పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో ఎవరి ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి సర్కార్ పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచించుకోవాలని డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిగానే కెసిఆర్ సుప్రీం కోర్టుకు వెళ్లారని, మే 15, 2019న తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారని ప్రకటించారని, ఆ విషయాన్ని జగన్మోహన్రెడ్డి ఖండించ లేదని గుర్తు చేశారు. పోలవరాన్ని నాశనం చేయడానికి దుష్టశక్తులతో అపవిత్ర కలయికతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ విషయం మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాబోయే రోజుల్లో తెలుగు ప్రజలు మరింత ఆర్థిక సంక్షోభంలోకి కొట్టుకొనిపోయే విధంగా ఆర్థిక సరళీకరణలతో ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో నేటి ఈ రాజకీయ వ్యవస్థలో రోజురోజుకీ రాష్ట్ర ప్రజల ఆర్థిక, జీవన ప్రమాణాలు తీసికట్టుగా పోతున్న క్రమంలో రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు ఆయకట్టు పోలవరం కోసం నోరు తెరుచుకుని ఆశగా ఎదురుచూస్తుంటే జగన్మోహన్రెడ్డి సర్కార్ మాత్రం తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ, ప్రజలకు చిన్నపాటి పప్పుబెల్లాలులా సంక్షేమ కార్యక్రమాలను పంచుతూ, తన పాలన మరో పదేళ్లు పొడిగించుకోవచ్చని ఆశ పడుతూ రాష్ట్ర అభివృద్ధి పదాన్ని నట్టేట ముంచుతున్నారని, ప్రజలను అమాయకులుగా పప్పుబెల్లాలకు ఆశపడే ఆశాజీవులుగా భ్రమపడితే, రాబోయే రోజుల్లో ఆ ప్రజలే ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వ పథకాల అసలు రంగును బయట పెడతారని అన్నారు. ఆనాడు జగన్ మోహన్ రెడ్డి సర్కారును ఏ దేవుడు రక్షించలేడని, ఆనాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి పెద్దదిక్కుగా మారబోయే రోజు అతి త్వరలో ఉన్నదని, జగన్ మోహన్ రెడ్డి ప్రజలను తక్కువ అంచనా వేసి ప్రజలను అవమానపరిచ వద్దని నూకసాని బాలాజీ తీవ్రంగా హెచ్చరించారు.