– జగన్ పాలనలో అదుపులేని ధరలు. – అడ్డగోలుగా పెంచుతున్న పన్నులు – ఆదాయం పెరగకున్నా.. ప్రజల నెత్తిన భారం పెంచుతున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం – వైసిపి రెండేళ్ల పాలనపై ముద్రించిన పుస్తకమంతా అబద్ధాలు, అసత్యాల పుట్ట – ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అన్న వ్యక్తి, ఇప్పుడు కేసుల భయంతో దాని ఊసే ఎత్తడం లేదు. – అప్పులు చేస్తున్న అభివృద్ధి మాత్రం శూన్యం. – పాత పథకాలకు పేర్లు మార్చడం, ఉన్న వాటిని తీసివేయడమేనా సంక్షేమం.? – రాష్ట్రానికి కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదు.
ఒంగోలు : జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలనా కాలంలో ప్రజల దగా పడ్డారని, వైసిపి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై ముద్రించిన పుస్తకమంతా అబద్ధాలు, అసత్యాల పుట్టని ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ప్రకాశం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ విమర్శించారు. ఒంగోలులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి అన్న వ్యక్తి, ఇప్పుడు కేసుల భయంతో దాని ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. చివరకు ఆర్డినెన్స్ ల రూపంలో బడ్జెట్ ఆమోదించుకునే దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని మండి పడ్డారు. 2018-19 లో మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో 36.32శాతం వరకు ఎకనామిక్ సర్వీసెస్ కు ఖర్చు చేశారు. 2019-20లో 22.19%, 2020-21లో 24.91 % లోపే ఖర్చు పెట్టారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పుస్తకాల్లోనే ఈ విషయాన్ని పేర్కొన్నారు. రెండేళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పడానికి బడ్జెట్లో ఎకనామిక్ సర్వీస్ కు చేసిన కేటాయింపులే నిదర్శనం అని నూకసాని అన్నారు. 2018 -19లో 16,859కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి ఖర్చు చేస్తే… జగన్ రెడ్డి సర్కారు 2019-20లో 12,248కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని విమర్శించారు. ఆదాయం లేదు.. కోవిడ్ వల్ల పడిపోయింది అంటున్నారు. కోవిడ్ సమయంలోనే మద్యంపై పెరిగిన ఆదాయం గురించి, పెంచిన పన్నులు, ధరల ద్వారా పెరిగిన ఆదాయం గురించి ఎందుకు మాట్లాడరని బాలాజీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
రెండేళ్లలో రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు 28శాతం నుంచి 38శాతానికి పెరగడానికి ప్రభుత్వ వైఫల్యాలు కారణం కాదాని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 17,826కోట్లతో అమలు చేసిన 17 సంక్షేమ పథకాలను జగన్ సర్కార్ రద్దుచేయడం వాస్తవం కాదా.? అని ప్రశ్నించారు. పాత పథకాలకు పేర్లు మార్చడం, ఉన్న వాటిని తీసివేయడమేనా సంక్షేమం.? అన్నారు. ఆరోగ్యం కోసం ప్రజలు విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన దుస్థితి కల్పించడం వాస్తవం కాదా.? అని ప్రశ్నించారు. పేదలకు ఉచితంగా కోవిడ్ చికిత్స ఎందుకు అందించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా.? అని అన్నారు.
టిడిపి హయాంలో తలసరి ఆదాయం 2అంకెల్లో ఉంటే, ఇప్పుడు 1.03కి పడిపోయిందన్నారు. కేపిటల్ ఎక్స్పెండిచర్ ఎకనామిక్ సర్వీసెస్ కు ఖర్చు పెట్టకుండా సంక్షేమానికి అరకొరగా కేటాయిస్తూ అంతా బాగా చేశామనడం అబద్ధం కాదా.? అని అన్నారు. జి.ఎస్.డి.పి, రెవిన్యూ, స్టాంప్స్ అండ్ డ్యూటీలపై ఎందుకు ఆదాయం రావడం లేదో చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందాని నూకసాని ఘాటుగా విమర్శించారు.
ప్రజల జేబులు గుల్ల చేస్తున్న జగన్ రెడ్డి : జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎడా, పెడా పన్నులు బాదేస్తూ జనం జేబులకు చిల్లు పెట్టి జీవితాలను గుల్ల చేస్తున్నారని నూకసాని విమర్శించారు. ప్రభుత్వాలు ఉన్నది ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికా.? లేక ప్రజల జీవన ప్రమాణాలు పణంగా పెట్టి రాష్ట్రానికి ఆదాయం సమకూర్చుకోవడానికా అని ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రజల దుస్థితిని గుర్తించి ధరలు తగ్గించాల్సిన ప్రభుత్వం, ప్రతి రోజు ధరలు పెంచి మరింత ఆర్థిక ఇబ్బందుల పాలు చేయడం బాధ్యతా రాహిత్యమని విమర్శించారు. రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాలేదు. ఉపాధి అవకాశాలు పెరగలేదు. ఆదాయ మార్గాలు పెరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 90% పైగా పథకాలను అప్పులతోనే నెట్టుకొస్తున్నారు. ఆ అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేస్తూ.. భారాన్ని ప్రజల నెత్తిన పడేస్తున్నారని అన్నారు. రెండేళ్లలో జగన్ రెడ్డి చేసిన అప్పులు : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏడాదికి సగటున 26వేల చొప్పున అప్పు చేయగా జగన్ రెడ్డి సర్కారు ఏడాదికి సగటున రూ.82,966కోట్ల అప్పు చేసిందని, ఇంత అప్పులు చేస్తున్న అభివృద్ధి మాత్రం శూన్యం అని బాలాజీ విమర్శించారు.
అభివృద్ధి కన్నా దోపిడీకే ప్రాధాన్యం : రెండేళ్ల జగన్ రెడ్డి పాలనలో ధరల పెంపు, అప్పులు పెంపుతో ఒక్కో కుటుంబంపై 2.50లక్షలకుపైగా భారం మోపారని అన్నారు. ఇదే విషయాన్ని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ స్టాండర్డ్స్ కూడా బయటపెట్టిందన్నారు. చంద్రన్న పాలనలో 1500 ఉన్న ట్రాక్టర్ ఇసుక.. జగన్ రెడ్డి పాలనలో 5వేలకు పెంచారని అన్నారు. వైసీపీ నేతల దోపిడీ కోసం పెంచిన ఇసుక, సిమెంట్ ధరల వలన భవన నిర్మాణ రంగం కుప్పకూలిందన్నారు. 125 రకాల వృత్తులు, వ్యాపారాలు దెబ్బతిన్నాయని చెప్పారు. భారతి సిమెంట్ కంపెనీ లాభాల కోసం బస్తా సిమెంట్ ధరను రూ. 370కి పెంచారని ఆరోపించారు.
నాసిరకం మద్యం పోస్తూ క్వార్టర్ పై 100పెంచారని, ఒక్క మద్యంలో ఏడాదికి 5వేల కోట్లు, ఐదేళ్లలో 25 వేల కోట్లు దోచుకుంటున్నారని అన్నారు. కరోనాతో ఆదాయం లేని సమయంలో విద్యుత్ స్లాబ్ రేట్లను మార్చి ప్రజల్ని దోచుకున్నారని చెప్పారు. ఆర్టీసీ చార్జీలు, రిజిస్ట్రేషన్ ధరలు, స్టాంప్ డ్యూటీ, వృత్తి పన్ను, చివరికి రేషన్ సరుకుల ధరలు కూడా పెంచారని అన్నారు. అన్ని వస్తువులపై ధరలు పెంచడం వలన.. పన్నులు పెంచడం వలన.. ఒక్కో కుటుంబంపై రెండేళ్ళలో 2.5లక్షల భారం మోపారని వివరించారు. పెంచిన పన్నులు, ధరలు, తెచ్చిన అప్పుల ద్వారా వచ్చిన ఆదాయం వైసీపీ నేతల బీరువాల్లోకి చేరుతుందని అన్నారు.
అమ్మ ఒడి పేరుతో 14వేలు ఇస్తూ.. నాన్న బుడ్డిలో 36వేలు దోచేస్తున్నారని చెప్పారు. వాహనమిత్రతో 10 వేలు ఇచ్చి.. డీజిల్ ధరలు, జరిమానాల పెంపుతో 30వేలకుపైగా దండుకుంటున్నారని అన్నారు. మత్స్యకార భరోసాతో 10వేలు ఇస్తూ.. సబ్సిడీపై అందే పడవలు, వలలు, ఐస్ బాక్స్ లు సహా అన్ని రకాల పథకాలను రద్దు చేశారని చెప్పారు. చేదోడు పేరుతో నాయి బ్రాహ్మణులు, టైలర్లు, రజకులకు 10 వేల చొప్పున విదిల్చి.. వారికి అందాల్సిన ఆదరణ పరికరాలు తుప్పు పట్టించారని గుర్తు చేశారు. లక్ష సబ్సిడీతో అందాల్సిన 2లక్షల రుణాలను రద్దు చేశారన్నారు. ఫెడరేషన్ ల ద్వారా రుణాలు ఎత్తివేశారని చెప్పారు. నేతన్న నేస్తం అందిస్తూ చేనేతలకు నూలు, రంగులు, ఇతర వస్తువులపై అందే సబ్సిడీని రద్దు చేశారని, ఆప్కో ద్వారా అంతర్జాతీయ స్థాయి వ్యాపారానికి తూట్లు పొడిచారని అన్నారు.
ఇమామ్, మౌజమ్లకు వేతనాల పేరుతో హడావిడి చేసి.. ముస్లిం మైనార్టీలకు అందాల్సిన రుణాలు, షాదీఖానాల నిర్మాణం, మసీదుల అభివృద్ధి నిధులు నిలిపివేశారని చెప్పారు. ఈ విధంగా ఎంతో ఇస్తున్నట్లు ప్రకటించుకుంటున్న ప్రభుత్వం.. ఆయా సామాజిక వర్గాలకు వాస్తవంగా అందాల్సిన ఆర్థిక సహాయాన్ని తుంగలో తొక్కిందని నూకసాని బాలాజీ ప్రభుత్వాన్ని ఆరోపించారు.