– ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు
– ముస్లిం మైనార్టీలపై ప్రభుత్వ వేధింపులు ఆపాలి
– వైసిపి నేతల ప్రోద్బలంతోనే పోలీసు అక్రమ కేసులు
ఒంగోలు (దమ్ము) : వైసిపి నేతల ప్రోద్బలంతోనే పోలీసులు అబ్దుల్ కలాం మీద అక్రమ కేసులు బనాయించి వేధించి అతను, అతని కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారని టిడిపి ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ ఆరోపించారు. సలామ్ కుటుంబ సభ్యుల ఆత్మహత్య ప్రభుత్వం చేసిన హత్యలేనని అన్నారు. అబ్దుల్ సలాం కుటుంబానికి ఆత్మ శాంతి కోసం ఒంగోలులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20సంవత్సరాల పాటు బంగారం దుకాణంలో నిజాయితీగా పని చేసిన అబ్దుల్ సలాంకు దొంగతనం అపవాదు వేశారని అన్నారు. అలాగే తన కాళ్ళ మీద తాను నిలబడి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటే అక్కడ కూడా దొంగతనం చేశారనే నెపాన్ని ఆయన కుటుంబం మీద పెట్టడం దారుణమన్నారు. నంద్యాలలో పెట్టిన కేసులకు సంబంధించిన విచారణ కర్నూల్ లో జరిగడం ఏమిటని బాలాజీ ప్రశ్నించారు. సిసిటివి ఫుటేజీలో ఉన్న వ్యక్తిని గుర్తించకుండా అబ్దుల్ సలాం మీద కేసు పెట్టడంలో ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. చేయని నేరానికి అమాయకుడైన అబ్దుల్ సలాంని పోలీసులు చిత్రహింసలకు గురి చేసి, అతని పట్ల దురుసుగా ప్రవర్తించడంతో తాను ఏ తప్పు చేయకపోయినా పోలీసులు వేధిస్తున్నారనే అవమానాన్ని భరించలేక తాను కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నానని అబ్దుల్ సలాం సెల్ఫీ వీడియోలో తెలియజేసిన విషయాన్ని బాలాజీ గుర్తుచేశారు. ఒక అమాయకుడిని వేధించడంలో శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అనుచరుడు శ్రీధర్ రెడ్డి ఉన్న విషయం వాస్తవం కాదా?అని ప్రశ్నించారు. అలాగే అర్ధరాత్రి సలాం కుటుంబ సభ్యులైన అత్త దగ్గరికి వెళ్లి తెల్ల కాగితం మీద సంతకం చేయమని పోలీసులు ఒత్తిడి చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అబ్దుల్ సత్తార్ విషయంలో పోలీసులు మీద కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు అబ్దుల్ సలాం విషయం జరిగేది కాదని అన్నారు. ఇప్పుడు కూడా కర్నూల్ పోలీసుల మీద తూతూమంత్రంగా కేసులు పెట్టి వాళ్ళకి బెయిల్ రావడానికి సహకారం చేసి ఈ కేసును కూడా నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని బాలాజీ అన్నారు. అబ్దుల్ కలాం, ఆయన కుటుంబం ఆత్మహత్యకు కారణమైన పోలీసుల్ని వెంటనే డిస్మిస్ చేయాలని, డీఎస్పీని సస్పెండ్ చేయాలని, కేసును సిబిఐ చేత విచారణ జరిపించాలని, కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు వెంటనే ఏర్పాటు చేయాలని డాక్టర్ నూకసాని బాలాజీ డిమాండ్ చేశారు.
టిడిపి రాష్ట్ర కార్యదర్శులు పొదిలి శ్రీనివాసరావు,
కామరాజుగడ్డ కుసుమ కుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల రాజ్ విమల్, నగర ప్రధాన కార్యదర్శి దాయినేని ధర్మ, నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి సునీత మాట్లాడుతూ ప్రభుత్వం దమన నీతితో పోలీసు రాజ్యాన్ని నడుపుతోందని అన్నారు. ఈ ప్రభుత్వం మైనారిటీల మీద దాడులకు తెగబడిందన్నారు. ఇటువంటి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందని అన్నారు. ప్రభుత్వం అమాయకులను వేధించడం కాకుండా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి నండూరి చంద్ర, మహిళా నాయకురాలు టి. అనంతమ్మ, ఆర్ల వెంకటరత్నం, ఉప్పలపాటి నాగేంద్రమ్మ, కేసన శేషమ్మ, ఎం ప్రశాంతి, నెల్లూరి నాగేశ్వరమ్మ, అంజమ్మ, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు నావూరి కుమార్, ప్రధాన కార్యదర్శి కసుకుర్తి అంకరాజు, అధికార ప్రతినిధి డొక్క శ్రీనివాసరావు, బండారు మదన్, బడే సాహెబ్, రవీంద్ర,పవన్, చల్ల హరి, బోను దుర్గ, బెజవాడ మురళి, బోడపాటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.