సింగరాయకొండ దేవాలయ ఘటనలో అక్రమ అరెస్టులు అమానుషం

    316
    0

    – అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి
    – వైయస్ఆర్ సీపీ నాయకులు కక్షసాధింపు చర్యలకు టిడిపి నాయకులను బలి చేయడం సరికాదు.
    – పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు.
    – పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యక్తుల్ని అరెస్టు చేస్తారా?
    – విచారణ జరపమని ప్రశ్నించిన గొంతులను గొంతు నులిమేస్తారా?
    – ఒంగోలు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ
    ఒంగోలు : పాత సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆర్చి ఘటనకు సంబంధించి సమాచారం ఇచ్చిన వ్యక్తిని విలేకరులను విచారణ జరపండి అనడిగిన వ్యక్తులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ నూకసానీ బాలాజీ ఖండించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి చెయ్యి ధ్వంసం చేయబడిందా? లేదా అంతకు ముందే ఆ విధంగా ఉందా? అనే వాస్తవ విషయాలను పోలీసులు విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆ ఘటనను చూసి సమాచారం అందించిన ఆ దేవాలయం మోత కాపుని అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇలా సమాచారం ఇచ్చిన వారిని అరెస్ట్ చేస్తూ పోతే భవిష్యత్తులో పోలీసులకు సమాచారం ఇవ్వడానికి భయపడి ఎవ్వరూ ముందుకు రారని తెలిపారు.

    రాష్ట్రంలో ఇప్పటి వరకు 140దేవాలయాల్లో సంఘటనలు జరిగాయని అన్నారు. సింగరాయకొండ దేవాలయ ఘటనకు సంబంధించి ఈ విషయాన్ని ప్రచారం చేశారనే నెపంతో జర్నలిస్టులను అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు. సింగరాయకొండ దేవాలయానికి సంబంధించి వాస్తవాలు బయట పెట్టమని ప్రశ్నించిన తెలుగుదేశం నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని, ఇది అప్రజాస్వామిక చర్యని మండిపడ్డారు. గొంతెత్తి ప్రశ్నించే వారి గొంతు నులిమేస్తున్నారని, ఇది ఫాసిస్టు చర్యని, వైఎస్సార్సీపీ నాయకుల కుట్రపూరిత చర్యల ఫలితంగానే జరుగుతున్నాయని విమర్శించారు.

    ఇలా అక్రమ అరెస్టులు చేసి ప్రజలను భయ బ్రాంతులకు గురిచేయడం సమంజసం కాదన్నారు. సింగరాయకొండ దేవాలయం ఘటనలో వాస్తవ విషయాలను విచారణ జరిపి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు అరెస్టు చేసిన తెలుగుదేశం నాయకుడు గాలి హరిబాబు, ఆంధ్రజ్యోతి విలేకరి కాకర్ల నరసింహంను వెంటనే విడుదల చేయాలని, మరలా 15మందిని అరెస్టు చేయడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు వెంటనే నిలిపివేయాలని డాక్టర్ నూకసాని బాలాజీ డిమాండ్ చేశారు.