బాపట్ల (DN5 News) : సిపిఎం ఆధ్వర్యంలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులను ఖండించాలని గురువారం నిరసన తెలిపారు. సిపిఎం పట్టణ నాయకులు కె శరత్ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా గంగయ్య (CPM Gangaiah) మాట్లాడుతూ ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ కూటమి దాడిని సిపిఎంగా తీవ్రంగా ఖండిస్తున్నదని అన్నారు. కేంద్రంలో అధికారంలో భాగస్వామిగా ఉన్న టిడిపి కేంద్రంపై ఒత్తిడి చేయకుండా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. అన్ని విధాలా మద్దతు ఇస్తున్న ప్రతిపక్ష వైసిపి దీనిపై స్పందించ లేదని అన్నారు. ప్రధాని మోడీ ఇజ్రాయిల్ నాయకత్వంతో మాట్లాడి వచ్చిన తరువాతే ఇరాన్‌పై దాడి జరిగిందని, దాడి గురించి ముందే మోడీకి తెలిసి ఉండాలని అన్నారు.
బలమైన నిఘా వ్యవస్థ ఉందని చెబుతున్న కేంద్రం దీన్ని ఎందుకు పసిగట్టలేకపోయిందో చెప్పాలని అన్నారు. లేక దాడి విషయం ముందే తెలిసి ఇజ్రాయిల్ ప్రధానిని కలిశారా? అదైనా బయట పెట్టాలని అన్నారు. ఇరాన్ అన్ని సందర్భాల్లోనూ భారత దేశానికి మంచి మిత్రుడిగా ఉందని, అయినా ఆ దేశ అధినాయకుడిని చంపేస్తే స్పందించకుండా యుఎఈలో అమెరికా ఎయిర్‌బేస్‌ను ధ్వంసం చేశారనే అంశంపై మాత్రమే స్పందించడం అన్యాయమని తెలిపారు. ఇరాన్‌పై దాడితో ప్రపంచ ఆర్థిక పరిస్థితి, ఇండియా పరిస్థితి దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడిని నిలిపేయాలని అన్ని దేశాలూ డిమాండు చేయాలని కోరారు.
ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని, సఫలం అవుతున్నాయని అనుకున్న సమయంలోనే అమెరికా, ఇజ్రాయిల్ దాడి చేసి చర్చలకు విఘాతం కలిగించాయని అన్నారు. అప్రజాస్వామికంగా స్కూళ్లపై దాడిచేసి విద్యార్థులను చంపేసిందని తెలిపారు. తమపై దాడి చేస్తారనే ఉద్దేశంతోనే తాము దాడిచేశామని ట్రంప్ చెబుతున్న మాటలు అబద్ధాలని, ఇరాన్ అటువంటి ఆలోచనలు చేయడం లేదని పెంటగాన్ నివేదిక తెలిపినా దాడి చేశారని తెలిపారు. అయితే మోడీ దెబ్బతినిపోతున్న ఇరాన్ తరుపున కాకుండా దాడి చేస్తున్న దేశం తరుపున మిత్రులు, శత్రువులకు తేడా తెలియకుండా వ్యవహరించారని అన్నారు. ఈ విషయంలో అమెరికా వ్యూహంలో మోడీ భాగస్వామి అయ్యారని, ఇజ్రాయిల్ తరుపున స్పందించి దేశ ప్రతిష్టను దిగజార్చారని అన్నారు. ఇరాన్‌లో శుద్ధి కేంద్రాలు ధ్వంసం చేశామని గతంలోనే చెప్పిన అమెరికా అదే సాకుతో ఇప్ప్పుడు దాడిచేయడం అమానుషం అన్నారు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి కేవలం ఇరాన్‌కే పరిమితం కాకుండా ప్రపంచాన్ని తీవ్ర ఇబ్బందికి గురిచేసే స్థాయికి చేరుకుంటుందని అన్నారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడిని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నదని అన్నారు. వెంటనే ఈ దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నేడు అమెరికా అబద్ధాలను చెప్పి ప్రపంచ ప్రజానీకాన్ని మభ్యపెట్టి యుద్ధాన్ని, మారణహోమాన్ని సమర్థించుకుంటుందని అన్నారు. అన్ని సందర్భాలలో భారతదేశానికి గట్టి మిత్రుడిగా ఉన్న ఇరాన్‌పై మరో దేశం దాడి చేసి ధ్వంసం చేస్తుంటే ఖండించాల్సిందిపోయి ఇంతవరకు భారత ప్రధాని నోరు మెదపక పోవడం దుర్మార్గమని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి కృష్ణమోహన్, జిల్లా కమిటీ సభ్యులు పి కొండయ్య, నాయకులు కోటేశ్వరావు, ఎన్ భాస్కరరావు, నాగేశ్వరరావు, మణిరత్నం పాల్గొన్నారు.






