చీరాల : స్థానిక టిడిపి కార్యాలయంలో టిడిపి, జనసేన ఆత్మీయ సమావేశం బుధవారం నిర్వహించారు. సమావేశానికి టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి ఎంఎం కొండయ్య, జనసేన నియోజవర్గ ఇన్చార్జి అమంచి స్వాములు తమ తమ నాయకులతో హాజరైయ్యారు. కొండయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పేరుతో వైసిపి నిధులను స్వాహా చేస్తుందని ఆరోపించారు. గతంలో నీతులు చెప్పిన వాళ్లు ప్రస్తుతం రేషన్, ఇసుక మాఫియాకు తెరలేపి యదేచ్ఛగా ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని అన్నారు. జనసేన కలిసి రావటం బలం చేకూరిందని అన్నారు. 17నుండి ఇంటింటికి వెళ్లే కార్యక్రమం, ఉమ్మడి మేనిఫెస్టో భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమం చేయనున్నట్లు తెలిపారు. జనసేన ఇన్చార్జి ఆమంచి స్వాములు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంటే నియోజకవర్గంలో రాక్షస పాలన జరుగుతోందని అన్నారు. రామన్నపేటలో అక్రమంగా తమ నాయకులను నామినేషన్లను వేయకుండా అడ్డుకోవటం జరిగిందని అన్నారు. కొందరిపై దాడి చేసి, మరికొందరిని జీపు ఎక్కించుకుని వెళ్లారని అన్నారు. ఇకపై అలాంటి ఘటనలు మరల జరిగిన, అక్రమాలకు పాల్పడిన తరిమి కొట్టించుకునే పరిస్థితులు ఉంటాయని అన్నారు. మాజీ మంత్రి బాలనేని శ్రీనివాసరెడ్డికి సమీప బంధువైన డిపిఓ నారాయణరెడ్డి ద్వారా జిల్లాను అనేక చర్యలకు పాల్పడుతున్నారని దీనిపై విచారణ జరిపించాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శులను తమ ఆధీనంలో ఉంచుకొని పంచాయతీ నిధులు మొత్తాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. గవినివారిపాలెం, బోయినవారిపాలెం, వేటపాలెం ప్రాంతాలలో అక్రమంగా ఇసుక తవ్వకాలను జరుపుతు అధిక రేట్లతో విక్రయాలు చేస్తూ దోచుకుంటున్నారని అన్నారు. భవిష్యత్తులో అలియన్స్‌లో చీరాల నియోజకవర్గ సీటు ఎవరికి ఇచ్చిన సరే సోదర భావంతో ఐక్యంగా పనిచేసి అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. కార్యక్రమంలో టిడిపి పరిశీలకులు నాతని ఉమామహేశ్వరరావు, జనసేన పరిశీలకులు గూడూరి శివరాం ప్రసాద్, టిడిపి మాజీ జెడ్‌పిటిసి గుద్దంటి చంద్రమౌళి, కిరణ్, డేటా నాగేశ్వరావు, కౌతరపు జనార్దన్, టిడిపి పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీను, గంజి పురుషోత్తం, అమంచి రాజేంద్ర, గౌరీ అమర్నాథ్, జనసేన నాయకులు మామిడాల శ్రీనివాసరావు, పాలవలస శ్రీను, గోపాల కృష్ణ, బొగ్గుల పార్ధసారధి, సోమిశెట్టి కిరణ్, బాపట్ల జిల్లా కాపు సంక్షేమ సేన మహిళా అధ్యక్షులు కారంపూడి పద్మిని పాల్గొన్నారు.