టంగుటూరు : తెలుగు యువత మండల అధ్యక్షులు కాట్రగడ్డ అనిల్ గత ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లుల నగదు మంజూరు అయినప్పటికీ అధికారులు ఇవ్వకపోవడానికి నిరసనగా సచివాలయం ఎదుట దీక్షకు కూర్చున్నారు. పొందూరు గ్రామానికి చెందిన తెలుగు యువత మండల అధ్యక్షులు కాట్రగడ్డ అనిల్ శుక్రవారం సాయంత్రం పొందూరులోని సచివాలయం ముందు నిరాహారదీక్షకు దిగారు.
ఈ సందర్భంగా ఆయన దీక్షకు గల కారణాలను చరవాణిలో వివరించారు. గత టీడీపీ ప్రభుత్వంలో 14వ ఫైనాన్స్ ద్వారా గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి రూ.60లక్షలు ఆగిపోయాయని తెలిపారు. ఆ పనులకు సంబంధించి ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా ప్రస్తుతం రూ.ఐదు లక్షలు ఎఫ్టిఓలు నాలుగు నెలల క్రితం వచ్చివున్నా అధికారులు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ ఇబ్బందులు పెడుతున్నారే తప్ప తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని తెలిపారు. తాను చేసిన పనులకు సంబంధించి ఇప్పుడు వచ్చి ఉన్న రూ.ఐదు లక్షలైనా ఇవ్వాలని అధికారులను కోరితే వారు మాత్రం అధికార పార్టీకి చెందిన వైసీపీ నాయకులు ఇవ్వొద్దన్నారని చెప్పారన్నారు. టీడీపీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి టిడిపి వారిని కూడా వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టాలని వైసిపి నాయకులు చెబుతున్నారని అధికారులు అంటున్నారని ఆయన అన్నారు. కాబట్టి గత ప్రభుత్వంలో జరిగిన పనులకు సంబంధించి వచ్చిన డబ్బులు మాకు తెలియకుండా ఇవ్వవద్దని వైసీపీ నాయకులు చెప్పారని అధికారులు చెబుతున్నారన్నారు. తాను చేసిన పనులకు సంబంధించిన డబ్బులు తనకు ఇవ్వాల్సిన బాధ్యత అధికారులకు ఉందన్నారు. అలా ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప తనకు మరో మార్గం లేదని అన్నారు. అప్పులు చేసి తెచ్చిన డబ్బులతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టానని, ఇప్పుడు అప్పులవాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతున్నారని, ప్రస్తుతం వచ్చిన డబ్బులైనా ఇవ్వాలని లేకుంటే తనకు రావాల్సిన, ప్రస్తుతం వచ్చి ఉన్న డబ్బులు ఇచ్చే వరకు నిరాహారదీక్ష కొనసాగుతుందని తెలిపారు.