టంగుటూరు (దమ్ము) : ప్రశాంత వాతావరణంలో ఉన్న మండలంలో మతవిద్వేషాలు రెచ్చగొడితే తీవ్రపరిణామాలు వుంటాయని ఎస్సై మాతంగి శ్రీనివాసరావు హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో పూజారులు, పాస్టర్లు, ఇమాంలు మరియు సచివాలయ పోలీసులు, గ్రామ వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మనది లౌకిక రాజ్యం అని, భారత రాజ్యాంగానికి కట్టుబడి అన్ని మతాలు ఒక్కటేనని నమ్మి జీవిస్తున్నామని, ఎవరికి నచ్చిన వారు వారికి ఇష్టమైన దేవున్ని నమ్ముతూ ఇప్పటివరకు ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్నామన్నారు. ఇది శాంతికి, స్వతంత్రానికి నాంది అన్నారు. భారతదేశంలో ఇటువంటి ప్రశాంత వాతావరణంలో మనమందరం జీవిస్తున్నామన్నారు. కొందరు మతోన్మాద, ఛాందసవాదులు మన మధ్య అటువంటి సోదర భావాన్ని దెబ్బతీసేందుకు గొడవలు సృష్టించాలని చూస్తున్నారన్నారు. నా మతం గొప్పది, నా మతం గొప్పది అనే కుటిలబుద్ధితో మన మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని దేశంలో, రాష్ట్రంలో కొందరు చేస్తున్న కుట్రపూరితమైన పరిస్థితులు సృష్టిస్తున్నారని అన్నారు.
అందులో భాగంగా మన రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించాలని ఆంజనేయ విగ్రహాన్ని, మరియమ్మ విగ్రహాన్ని, ఈద్గా ధ్వంసం చేయడం జరిగిందన్నారు. ఇలా చేయడం వలన విజ్ఞతకోల్పోయి, అవగాహన లేని కొందరు ప్రజలు భయాందోళనకు గురై నా మతాన్ని కించపరిచారని, మా దేవుడ్ని ధ్వంసం చేశారని శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు అన్ని మతాల వారు, ఎవరి మతాన్ని వారు నమ్ముతూ, ప్రశాంత వాతావరణంలో ఉన్నామన్నారు.
మన మండలంలో ఇప్పటివరకు ఎటువంటి కుల, మత విద్వేషాలు జరగకపోవడానికి అందరి సహృదయమే కారణమన్నారు. అటువంటి ప్రశాంత వాతావరణాన్ని కుటిల బుద్ధితో ఎవరైనా కావాలని విద్వేషాలు రెచ్చగొడుతే అటువంటివారి సమాచారాన్ని గ్రామ వాలెంటర్లకు, సచివాలయం పోలీసులకు లేదా తమ పోలీసులకు కానీ సమాచారం ఇవ్వాలన్నారు. వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు. మన మండలంలో ఆరోగ్యకరమైన ప్రశాంత వాతావరణం ఉండేలా కృషి చేద్దామని అన్నారు.