Home ప్రకాశం కరోనా పాజిటివ్ తో ఉలిక్కిపడ్డ టంగుటూరు

కరోనా పాజిటివ్ తో ఉలిక్కిపడ్డ టంగుటూరు

906
0

టంగుటూరు : గ్రామ సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న రజక పాలానికి చెందిన టంగుటూరి శేషమ్మ అనే 75 ఏళ్ల వయసు కలిగిన వృద్ధురాలికి రాష్ట్ర వైద్యశాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్ లో కరోనా పాజిటివ్ గా నిర్దారణ అవ్వడంతో టంగుటూరు ఒక్కసారిగా ఉలిక్కి పడింది. శేషమ్మ చెన్నైలోని తమ బంధువుల ఇంటిలో శుభకార్యానికి వెళ్లి ఈ నెల 19న టంగుటూరులోని తన ఇంటికి వచ్చినట్లు తెలియడంతో ఆమెను స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రక్తనమూనాలు సేకరించి కరోనా పరీక్షలు చేశారు. ఆమెతో పాటు గ్రామానికి వచ్చిన 23మంది రక్తనమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. ఆదివారం రక్తనమూనాల ఫలితాలలో టంగుటూరు శేషమ్మకి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అవ్వడంతో ఆమెతో పాటు అనుమానంతో ఆమె కుటుంబ సభ్యులు ముగ్గురిని 108వాహనంలో ఒంగోలు రిమ్స్ కి తరలించినట్లు వైద్యాధికారి ప్రసాద్ బాబు తెలిపారు.

మండల అధికారులు హుటాహుటిన శేషమ్మ ఇంటికివెళ్లి ఆమెను ఒంగోలులోని రిమ్స్ కి తరలించారు. అధికారులు రజకపాలెం వెళ్లే మార్గాలను బారికేడ్లు కట్టి మూసివేశారు. గ్రామస్తులను ఎవ్వరిని బయటకు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పురంసెంటర్ నుండి శివాలయం వరకు రోడ్లపై బ్లీచింగ్ చల్లారు. శేషమ్మ చైన్నై నుండి వచ్చిన తర్వాత ఆమె రక్తనమూనాలు సేకరించి హౌస్ క్వారంటైన్ లో ఉంచారు. ఐతే ఆమె ఇంట్లో ఉండకుండా దగ్గరలోని 2కాలనీలలో జరిగిన ఫంక్షన్లలో పాల్గొన్నట్లు, ఆమె ఇంటి చుట్టుపక్కల వారితో అష్టాచమ్మా ఆట ఆడినట్లు అధికారులు, అక్కడి ప్రజలు తెలిపారు. దీనితో ఆమెతో సన్నిహితంగా ఉన్నవారు మాత్రం ఎవరికివారు భయం భయంగా వుంటున్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల అనంతరం టంగుటూరు మొత్తం రెడ్ జోన్ గా ప్రకటించాలో, రజకపాలెం, చుట్టుపక్కల ప్రాంతాల వరకు రెడ్ జోన్ గా ప్రకటించాలో సోమవారం ప్రకటించనున్నారు. శేషమ్మ ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎవరెవరిని కలిసిందని గ్రామ వాలంటరీలు, సచివాలయ ఉద్యోగులను, చుట్టుపక్కల ప్రజల నుండి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవలే కొండపి నియోజకవర్గంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కానందుకు నియోజకవర్గంలోని అధికారులను జిల్లా అధికారులు అభినందించారు.
ఏది ఏమైనా టంగుటూరు ఇప్పటి వరకు ప్రశాంతంగా వాతావరణంలో నుండి ఒక్కసారిగా కరోనా పాజిటివ్ నిర్దారణ అవ్వడంతో గ్రామస్తులు భయం గుప్పిటలోకి వెళ్లిపోయారు.