టంగుటూరు (దమ్ము) : యం.నిడుమనూరు గ్రామ దళిత సర్పంచ్ పిడుగురాళ్ల వెంకటశేషమ్మ రేపు అనగా 10న సోమవారం ఉదయం 8 గంటలకు టంగుటూరు బస్టాండు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం ముందు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరసన దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఇది దళితుల ఆత్మగౌరవ పోరాటమని ఆమె తెలిపారు. అధికార వైసిపి సర్పంచ్ గా గెలిచినప్పటికీ దళితురాలునైనందున తనపట్ల చులకన భావంతో గ్రామ పరిపాలనా వ్యవహారాలలో అధికారులు తనకు సహకరించటం లేదని అన్నారు. పాలనలో తనకు అడుగడుగునా అడ్డుతగులుతూ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామంలోని పంచాయతీ మినరల్ వాటర్ ప్లాంట్ గతకొన్నేళ్ళుగా గ్రామానికి చెందిన ప్రయివేటు వ్యక్తి తన అధీనంలో ఉంచుకుని, నీటిని యధేచ్చగా అమ్ముకుంటూ పంచాయతీకి రావాల్సిన ఆదాయానికి గండికొడుతున్నాడని అన్నారు. ఆ మినరల్ వాటర్ ప్లాంట్ ని పంచాయతీకి స్వాధీనపరచాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. పంచాయతీ మోటర్లు దొంగలు ఎత్తుకెళ్లారని సంబంధిత అధికారులకు వినతిపత్రాల ద్వారా విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో చేసేదిలేక గతనెలలో టంగుటూరు ఎంపిడిఓ కార్యాలయం ముందు నిరసన దీక్షకు దిగడంతో 10 రోజులలో వాటర్ ప్లాంట్ ని పంచాయతీ స్వాధీన పరుస్తానని ఎంపిడిఓ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారని, నెలగడుస్తున్నా ఇంతవరకు స్వాధీన పరచలేదని అన్నారు.
అధికార పార్టీ సర్పంచ్ నైనప్పటికీ దళితురాలి నైనందునే చులకన భావంతో తనకు పరిపాలనా వ్యవహారాలలో సహకరించక పోగా అధికారులు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోప్పించారు. చేసేది లేక అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కుల సాధనకోసం శాంతియుతంగా నిరసన దీక్షకు దిగక తప్పని పరిస్థితి వచ్చిందన్నారు.