దళిత యువతి మనీషా మృతికి నైతిక బాధ్యత వహించి యూపీ సీఎం యోగి రాజీనామా చేయాలి : ఐక్యకార్యాచరణ కమిటీ డిమాండ్
టంగుటూరు (దమ్ము) : ఉత్తరప్రదేశ్ హత్రాస్ గ్రామంలో మనీషా వాల్మీకి అనే దళిత యువతిపై అదే గ్రామ అగ్రవర్ణానికి చెందిన యువకులు ఆమె నాలుక కోసి, ఆపై అత్యాచారం చేసి, ఆమె చావుకు కారణమైన మృగాళ్లను కఠినంగా శిక్షించాలని దళిత ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ యూపీ సీఎం యోగి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బస్టాండ్ సెంటర్లోని నాలుగురోడ్ల కూడలిలో కారుమంచి ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆడిత్యనాధ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా పీవైఎల్ రాష్ట్ర నాయకులు నాగరాజు మాట్లాడుతూ మనీషా వాల్మీకి అనే దళిత యువతిని అత్యాచారం చేసి, హత్య చేసిన అగ్రకుల మృగాలను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో దళిత, మైనార్టీ, ఆదివాసీ స్త్రీలపై అత్యాచారాలను అరికట్టాలని, చట్టాలను కఠినంగా అమలు చేయాలని కోరారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కావలి జవహర్ భారతి లెక్చరర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ లో యోగి ప్రభుత్వం రామ రాజ్యం తీసుకొస్తామని ప్రకటిస్తూ ఆ రామరాజ్యం ఎలా ఉంటుందో చెప్పే దాంట్లో భాగంగానే నేడు సాక్ష్యాలను మాయం చేస్తూ నిందితులను కాపాడే కుట్రలకు పాల్పడటం, దళిత, మైనారిటీ వర్గాల హక్కులను కాలరాయడం జరుగుతుందన్నారు. ఇదే రామ రాజ్యం అని చెప్పకనే చెబుతున్నారన్నారు. అగ్రకుల అమ్మాయిలపై దాడులు జరిగినప్పుడు విచారించకుండానే బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్న పాలకులు నేడు దళిత యువతి అత్యాచారానికి గురై, మృతి చెందితే ఆ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించడం అత్యంత బాధాకరమైన, హేయమైన విషయమన్నారు. ఇలాంటి రామ రాజ్యం మాకు అక్కరలేదన్నారు. మాకు కావాల్సింది దళిత, కార్మికవర్గ రాజ్యమన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మనీషా మృతిపై యూపీ ప్రభుత్వం వెంటనే జుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ యూత్ ఫోర్స్ నాయకులు దగ్గుమాటి శివకుమార్, మేడికొండ కిరణ్ మాట్లాడుతూ దేశంలోని దళితులంతా ఏకమై ఇలాంటి అకృత్యాలను అడ్డుకోవాలని కోరారు.
మనీషా హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం అనంతరం ట్రంక్ రోడ్డు నుండి కొండేపి రోడ్ మీదుగా తహసీల్దారు కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తహశీల్దారుకు మెమోరాండం అందజేశారు. కార్యక్రమంలో పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, జిల్లా కార్యదర్శి సిసింద్రీ, అంబేద్కర్ యుాత్ ఫోర్స్ నాయకులు మేడికొండ దుర్గాప్రసాద్, మన్నం శ్రీనివాసరావు, పిఓడబ్ల్యు నాయకురాలు అరుణ, చందన శ్రీ, పీవైఎల్ నాయకులు చొప్పర తిరుమలరావు, ఐఎఫ్టియు నాయకులు వెంకటరావు, రాజు, ఎఐకెఎంఎస్ జిల్లా నాయకులు చక్రవర్తి, కారుమంచి గ్రామ యువకులు పాల్గొన్నారు.