టంగుటూరు : స్థానిక అరుంధతి నగర్ లోని అంబేద్కర్, జగజ్జీవనరావ్ విగ్రహాల వెనుక కమ్యూనిటీ భవనం ముందు ఉన్న ఖాళీ స్థలంలో నిర్మించ తలపెట్టిన రైతు భరోసా కేంద్ర భవన నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ అరుంధతి నగర్ యువకులు తహశీల్దార్ సిహెచ్ ఉష, మండల అభివృద్ధి అధికారి సిహెచ్ హరికృష్ణ, గ్రామ కార్యదర్శి జగదీష్ కు వినతిపత్రం అందజేశారు. అదే ఖాళీ స్థలంలో గతంలో నిర్మించ తలపెట్టిన గ్రామ సచివాలయాన్ని సైతం అరుంధతి నగర్ వాసుల అందరి విజ్ఞప్తి మేరకు అక్కడ నుండి మరో చోటుకు మార్చడం జరిగినది.
ఈ ఖాళీ స్థలం అరుంధతి నగర్ మొత్తానికి అన్ని సామాజిక కార్యక్రమాలకు, వివాహ కార్యక్రమాలకు, విద్యార్థులు ఇండోర్ గేమ్స్ ఆడుకొనుటకు ఉపయోగించుకుంటున్నారు. అలాగే పండుగలు, పబ్బాలకు నగర్ వాసులు అందరూ కలిసి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగించు కొనుచున్నందున రైతు భరోసా కేంద్ర భవనాన్ని మరో చోట నిర్మించాలని కోరారు. విగ్రహాల వెనుక ఉన్న స్థలం చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చేసి, అక్కడ నిరుపయోగంగా ఉన్న పాత భవనానికి మరమ్మతులు చేయించి, ఆ స్థల సముదాయంలో బహిరంగ సభావేదిక నిర్మాణానికి నిధులు కేటాయించాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో
శిఖా అగ్నివేష్, శిఖా రోషన్, రావినూతల రాజు, అరుంధతి నగర్ యువకులు పాల్గొన్నారు.