చీరాల : మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి వారికి ఆర్థిక పరిపుష్టి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎంఎల్ఎ కొండయ్య అన్నారు. మహిళల్లో ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన సాధించే లక్ష్యంతో కుట్టు మిషన్ ఉచిత శిక్షణ కార్యక్రమం కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేటపాలెం ఎంపీడీఒ కార్యాలయం కమ్యూనిటీ హాల్ నందు కుట్టు మిషన్ ఉచిత శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంబించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్ ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి మహిళల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచే దిశగా కృషి చేస్తుందని అన్నారు. కుట్టు మిషన్ నేర్చుకునే మహిళలు ప్రతిరోజూ క్రమం తప్పకుండా హాజరై నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. మహిళలు స్వయం శక్తితో ఉపాధిని సంపాదించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని అన్నారు. ఈ అవకాశాలను ఉపయోగించుకొని కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగు పరుచుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ కౌతరపు జనార్దనరావు, అధికారులు, తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు అభిమానులు పాల్గొన్నారు.