Home బాపట్ల సూర్యఘర్‌ యూనిట్ల స్థాపనలో ప్రధమ స్థానంలో నిలపాలి

సూర్యఘర్‌ యూనిట్ల స్థాపనలో ప్రధమ స్థానంలో నిలపాలి

8
0

బాపట్ల (DN5 News): సూర్య ఘర్ యూనిట్ల స్థాపనలో బాపట్ల జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ (Dr.VinodKumar)కోరారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం సమీక్షించారు. సౌర విద్యుత్‌తో ప్రతి ఇంటిలో వెలుగులు నింపాలని చెప్పారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యాలు చేరుకోవాలని అన్నారు. 24,620 సూర్య ఘర్ యూనిట్లు స్థాపించాలని అన్నారు. నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం కల్పిస్తున్న లబ్ధి చేకూర్చాలని అన్నారు. విద్యుత్ శాఖ అధికారులు వేగంగా పని చేయాలని సూచించారు.

జిల్లాలోని రైతులు పండించిన పంటలు గోదాముల్లో దాచుకోవడానికి గోదాములను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాకు 45 గోదాములు మంజూరు కాగా అందులో 20 గోదాములు ఇప్పటికే పూర్తి చేశామని అన్నారు. 15 గోదాముల నిర్మాణం వివిధ దశలలో ఉన్నాయని అన్నారు. మిగిలిన గోదాములకు స్థలం లేక పోవడంపై ఆరా తీశారు. వేరొక గ్రామాలను ఎంపిక చేసి, ఆ గ్రామాలలో స్థలాల గుర్తింపు ప్రక్రియ చేపట్టాలని అన్నారు. రైతు సహకార సంఘాలకు మేలు జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. సహకార, మార్కెటింగ్ శాఖలు సంయుక్తంగా క్షేత్ర పరిశీలన చేయాలని ఆదేశించారు.

జిల్లా మినరల్ ఫండ్ ద్వారా మంజూరు చేసిన అభివృద్ధి పనులు అధికారులు వేగంగా పూర్తి చేయాలని అన్నారు. ఆయా గ్రామాలలో ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా మొదలుపెట్టిన పైపులైన్ నిర్మాణ పనులు నాణ్యతతో పూర్తి చేయాలని అన్నారు. ఇంజినీరింగ్ అధికారులు సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని చెప్పారు. నిర్ణయించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని అన్నారు. వేటపాలెం, చిన్నగంజాం మండలాలలో మొదలైన పనులు ఏప్రిల్ 15న పూర్తి చేయాలని అన్నారు. నిజాంపట్నం నిర్మల్ నగర్‌లో రూ.1.20 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులలో జాప్యం లేకుండా పర్యవేక్షించాలని అన్నారు. చిన్నగంజాం మండలంలో రూ.2కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు పనులు ఏప్రిల్ లోగా పూర్తి చేయాలన్నారు. రూ.3.22 కోట్లతో తాతావారిపాలెం రోడ్డు పనులు మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని అన్నారు.

అంగన్వాడి కేంద్రాల భవన నిర్మాణాలు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రూ.29 లక్షలతో వన్ స్టాప్ సెంటర్ సఖి కేంద్రాన్ని మంజూరు చేయగా ఆరు నెలలైనా ప్రారంభించకపోవడంపై సంబంధిత డిఈని మందలించారు. రూ.10 లక్షలతో బాలసదన్ భవన నిర్మాణ పనులు మార్చి 15కు పూర్తి చేయాలన్నారు. శిశు గృహంలో మరమ్మతు పనులు 15 రోజుల్లో పూర్తి చేయాలని అన్నారు. 73 అంగన్వాడి కేంద్రాల భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.

సమావేశంలో సిపిఓ షాలేము రాజు, విద్యుత్ ఎస్ఈ ఆంజనేయులు, భూగర్భ గనుల శాఖ అధికారి ఫణి కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు, ఆర్ అండ్ బి డిఈ అరుణకుమారి, మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి రాధామాధవి పాల్గొన్నారు.