కారంచేడు (DN5 News) : మండలంలోని కొడవలివారిపాలెం జెడ్‌పి ఉన్నత పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ శాసనసభను గురువారం సందర్శించారు. శాసన సభ సమావేశాలు ప్రత్యక్షంగా వీక్షించిన విద్యార్థులు సభ నిర్వహణ, చట్టసభ కార్యకలాపాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థులు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Speakar Chintakayala AyyannaPatrudu), డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు (Depyuty Speakar Raghurama Krishna Raju), హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha), శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు (MLA Yeluri Sambashivarao)తో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడి శాసనసభ ప్రాధాన్యత, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధుల పాత్ర వివరించారు.
అనంతరం విద్యార్థులతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే రాజకీయ చైతన్యం, నాయకత్వ లక్షణాలు పెంచుకోవడం ఎంతో అవసరమని అన్నారు. శాసన సభ వంటి ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రత్యక్షంగా చూసే అవకాశం విద్యార్థులకు మంచి అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు. చట్టసభలు ఎలా పనిచేస్తాయి, ప్రజా సమస్యలపై ఎలా చర్చలు జరుగుతాయన్న విషయాలు తెలుసుకోవడం ద్వారా విద్యార్థులకు విస్తృతమైన అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. శాసనసభ సందర్శనపై విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి ఫోటోలు దిగారు.






