మార్టూరు (Marturu) : అంగన్‌వాడీ వ్యవస్థ బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసిందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (MLA Yeluri Sambashivarao) పేర్కొన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు 5జి స్మార్ట్ ఫోన్లు తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అందజేశారు. ఆయన స్వయంగా అంగన్‌వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు, ప్రాజెక్టు ఆఫీసర్లకు 5జి మొబైల్స్ అందజేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. డిజిటల్ సాంకేతికతతో అంగన్‌వాడీ సేవలు మరింత పారదర్శకంగా, వేగంగా చేరే అవకాశం ఉందని చెప్పారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహార వివరాలు, హాజరు నమోదు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాలు యాప్‌ల ద్వారా సమర్థవంతంగా నిర్వహించవచ్చని తెలిపారు.

వేమూరు (Vemuru) : మండలంలో నిర్వహించిన ‘మీకోసం పిజిఆర్ఎస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో శాసన సభ్యులు నక్కా ఆనంద బాబు (MLA Nakka Ananda Babu) ప్రజల నుండి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలు స్వీకరించారు. అనంతరం సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. ఎంపిడిఒ కార్యాలయంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అమృతలూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం మంజూరు చేసిన నూతన సెల్‌ఫోన్లను అందజేశారు. కార్యక్రమంలో వేమురు ఎఎంసి చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి, నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని లక్ష్మీదేవి, ఎంపిడిఒ రవిబాబు, తహశీల్దారు బి సుశీల ఉన్నారు.






