Home జాతీయం జైళ్లేమైనా… అత్తారిళ్లా… బాగుండ‌టానికి..?

జైళ్లేమైనా… అత్తారిళ్లా… బాగుండ‌టానికి..?

607
0

డిల్లీ : జైలుకు ఎవరు వెళ‌తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర‌లేదు. నేరం చేసిన వాళ్ల‌నే క‌దా జైలుకు పంపేది. మ‌రి భార‌త దేశంలో జైళ్లు బాగుండ‌వంట‌! అందుకే అరెస్టు కావ‌డంలేదంట‌! నేరం చేసి విదేశాల‌కెళ్లిన ఆర్ధిక నేర‌స్తులను అరెస్టు చేసేందుకు వెళ్లిన సిబిఐ అధికారుల‌కు విదేశాల్లో ఉంటూ ఇంట‌ర్‌పోల్ ద్వారా అరెస్టు కాకుండా ఉండేందుకు చెబుతున్న కార‌ణాలు చూస్తుంటే…? ఔరా… ఆర్ధిక నేరాల‌కు పాల్ప‌డ్డ వారి నుండి మామూళ్లు పొందిన పాల‌కులు ఏవిధంగా నేర‌స్తుల‌ను త‌ప్పిస్తారో? త‌ప్పించుకునేందుకు దేశంపై ఎలాంటి ఆరోప‌ణ‌లు చేయాలో కూడా శిక్ష‌ణ ఇస్తారేమో! అనిపిస్తుంది.

భార‌త దేశంలో జ‌నం సొమ్ము కొల్ల‌గొట్టేందుకు బ్యాంకులు మాత్రం బాగుంటాయి. నేరం చేసి శిక్ష అనుభ‌వించేందుకు అరెస్టు క‌మ్మంటే మాత్రం జైళ్లు బాగుండ‌వంట‌. అందుక‌ని అరెస్టు కావ‌డంలేదంట‌. నేరం చేసి ఎంత చ‌క్క‌ని స‌మాధానం చెబుతూ విదేశాల్లో విలాసాలు అనుభ‌విస్తున్నారో చెప్పేందుకు విజ‌య‌మాల్య మొన్న ఇప్పుడు తాజాగా గోదావ‌రి అర్భ‌న్ బ్యాంకు కుంభ‌కోణంలో నిందితుడు మెహుల్ చోక్సీ చేసే ఆరోప‌ణ‌లు వింటుంటే… మ‌న‌పాల‌కులు ఎంత నిబ‌ద్ద‌త‌తో కేసులు విచార‌ణ చేయిస్తున్నారో అర్ధ‌మ‌వుతుంది.

భారత జైళ్లలో గాలి, వెలుతురు ఉండదని గ‌తంలో విజయ్‌ మాల్యా ఆరోపించి అరెస్టును వాయిదా వేయించుకున్న విషయం తెలిసిందే. లండ‌న్‌లో ఉంటున్న విజ‌య‌వాల్య లండ్ కోర్టులో సైతం ఇదే వాద‌న వినిపించార‌ట‌. అందుకే మాల్యాను ఉంచాల‌నుకున్న జైలు వీడియోను లండ‌న్ కోర్టుకు చూపాల‌ని సిబిఐని కోరింది. దీంతో మాల్యాను ఉంచాలనుకున్న‌ జైలు, బ్యార‌క్‌కు సంబంధించిన వీడియోను సీబీఐ అధికారులు లండన్‌ కోర్టుకు పంపించారు. ప్ర‌స్తుతం పంజాబ్ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం కేసులో నిందితుడైన మెహుల్‌ ఛోక్సీ కూడా ఇలాంటి ఆరోపణలే చేసి అరెస్టు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మెహుల్‌ ఛోక్సీపై రెడ్‌ కార్నర్‌ నోటీసు ఇవ్వాల‌ని సీబీఐ ఇంటర్‌పోల్ అధికారుల‌ను కోరింది. సిబిఐ ప్ర‌తిపాద‌న‌పై ఛోక్సీ అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత జైళ్లలో సదుపాయాలు బాగుండవని పేర్కొన్నారు. భారత జైళ్లు మానవ హక్కులను ఉల్లంఘిస్తాయని చేసిన ఆరోపణలపై సీబీఐ ఘాటుగానే స్పందించింది. ‘నిబంధనలకు లోబ‌డే భారతలో జైళ్లు నిర్వహిస్తున్నాం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మానవ హక్కుల కమిషన్‌ కమిటీలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో జాతీయ మానవహక్కుల కమిషన్‌ ఉంది. జైళ్లలో మానవహక్కులు ఉల్లంఘించిన‌ట్ల‌యితే ఈ కమిషన్లు చర్యలు తీసుకుంటాయి. మాన‌వ హ‌క్కుల‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని సీబీఐ అధికారులు తిరుగు స‌మాధానం ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

బ్యాంకుల్లో రూ.వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి బ్రిటన్‌లో ఉంటున్న‌ మాల్యాను భార‌త్‌కు పంపించే అంశంపై లండన్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. విచార‌ణ‌లో భారత జైళ్లలో గాలి, వెలుతురు ఉండవంటూ మాల్యా అభ్యంతరం వ్యక్తం చేస్తూ లండ‌న్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై అక్క‌డి కోర్టు మాల్యాను ఉంచాలనుకుంటున్న జైలు వీడియోను పంపాల్సిందిగా భారత సీబీఐని అడిగింది. లండ‌న్ కోర్టు అడిగిన మీద‌ట‌ గతవారం సీబీఐ ఓ వీడియో పంపింది. టీవీ, వ్యక్తిగత వెస్ట్రన్‌ టాయిలెట్‌, బెడ్, వాషింగ్ రూం, గాలి, వెలుతురు ఉండేలా విశాలమైన ప్రాంతం.. వంటి సౌక‌ర్యాలున్న ముంబయి ఆర్థర్‌ రోడ్‌లోని జైలులో 12వ‌ బారక్ వీడియోను పంపారు.