చీరాల : మండలంలోని ఈపురుపాలెం స్ట్రెయిట్‌కట్, బైపాస్ రోడ్డు క్రింద సరైన నీటి పారుదల సౌకర్యం లేకపోవడంతో కుందేరు నీరు వెనక్కి చేరి ఈపురుపాలెం, తోటవారిపాలెం పంచాయతీలోని పంట భూములు, నివాస ప్రాంతాలు నీటమునిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రజా సంఘాల నాయకులు గుమ్మడి ఏసురత్నం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌కు వివరించారు. కలెక్టర్ కార్యాలయంలో కలిసి మంగళవారం వినతి పత్రం అందజేశారు. కుందేరు నీరు నిలవకుండా పారేలా బైపాస్ స్ట్రైట్‌కట్, బైపాస్ వద్ద సైఫన్ ఏర్పాటు చేయాలని కోరారు. పాత డ్రైనేజ్ లైన్లను శుభ్రం చేయాలని, బైపాస్ రోడ్డు కింద కొత్త కల్వర్ట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నీటి నిల్వ ఉండడం వల్ల దోమలు పెరిగి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. త్వరలో సమస్య తాను స్వయంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్టిలో ఉంచుకుని సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులను పురమాయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు గూడూరు శివరాం ప్రసాద్, సిపిఎం కార్యదర్శి నలతోటి బాబురావు, భగవాన్ దాస్, గుమ్మడి సూర్యప్రకాష్ పాల్గొన్నారు.






