చీరాల (DN5 News) : రామాపురం తీరంలో నూతనంగా పేకాట క్లబ్ ఏర్పాటు చేస్తున్నారని, అదే ఏర్పాటు జరిగితే లోకేష్ (Lokesh) తో దానిని ప్రారంభించాలని, పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో గంజాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాల తీవ్రత పెరిగి అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకోవాల్సిన పోలీసులే వాటికి కాపలా కాస్తూ డబ్బులు వసూలు చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ (ExMLA Amanchi Krishna Mohan) పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. కొత్తపేటలో బుధవారం జరిగిన రచ్చబండ వేదికలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (PCC President YS Sharmila Reddy) సమక్షంలో ఆయన మాట్లాడారు. ఉద్యమాలకు పురిటి గడ్డగా ఉన్న చీరాల ప్రాంతంలో పర్యాటక రంగం పేరుతో పేకాట క్లబ్ ఏర్పాటు చేసి అసాంఘిక కార్యక్రమాలకు తెర లేపుతాన్నారని ఆరోపించారు.
వాటిని కొంత మంది పోలీసులు ప్రోత్సహిస్తూ డబ్బులు తీసుకొని పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో రామాపురం టూరిజంగా అభివృద్ధి చెందాలని రూ.90 లక్షలతో ఎన్ఆర్‌ఇజిఎస్ నిధులతో తీరం వెంబడి రోడ్డు వేయించానని అన్నారు. మత్స్యకారులకు ఆ రహదారి ఎంతగానో ఉపయోగ పడిందని అన్నారు. అయితే ప్రస్తుతం కొంత మంది పోలీసుల జోక్యం అన్నిటిలో ఉంటుందని, ప్రతిదానికి డబ్బులు వసూలు చేస్తూ తీరంలో అసాంఘిక కార్యకలాపాలు ప్రోత్సహిస్తున్నారని అన్నారు. గతంలో ఈపురుపాలెం దారిలో, ఆదినారాయణపురంలో గంజాయి మత్తులో ఓ యువకుడుని కొందరు కత్తితో పొడిచిన చంపిన ఘటన గుర్తు చేశారు.
కావున పోలీసులు తీసుకున్న డబ్బులన్ని ఒక్కసారిగా పోగొట్టే పరిస్థితి త్వరలోనే వస్తుందని అన్నారు. చీరాల ఎమ్మెల్యే కొండయ్య అధికారంలో ఉన్నారు కాబట్టి తాను రిక్వెస్ట్ చేస్తున్నానని, ఇలాంటి క్లబ్లు ఓపెన్ కానివ్వకుండా చూడాలని కోరారు. ఎమ్మెల్యే ప్రత్యక్ష్య, పరోక్ష సహకారం ఉందో లేదో తెలియదని, విమర్శించడం లేదని, అయితే అధికారం ఉంది కాబట్టి ఆపాలని కోరుకుంతున్నానని అన్నారు. ఆపే శక్తి లేకుంటే తాను గతంలో కొత్తపేటలో ప్రభుత్వ హైస్కూలును లోకేష్‌తో ప్రారంభించినట్లుగా ఈ క్లబ్‌ను లోకేష్‌తోనే ప్రారంభించాలని అన్నారు.






