•గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు
•యువత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
•20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం
•అర్జీల స్వీకరణలో ఎమ్మెల్యే ఏలూరి
పర్చూరు : ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యతని, సమస్యల పట్ల అధికారులు సత్వరమే స్పందించాలని శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారానికి అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం దిశగా పనిచేయాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు చొరవ చూపాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు. సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రచించారని అధికారులకు సూచించారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందించాలని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. యువత ఆయా రంగాల్లో మెలుకువలు, శిక్షణ పొందాలని సూచించారు. రానున్న రోజుల్లో 20 లక్షల మందికి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. యువత తమలో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు శిక్షణ పొందాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాజధాని అమరావతి నిర్మాణం పరుగులు తీస్తుందని, నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పిస్తుందన్నారు. యువత ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలన్నారు.