అద్దంకి (DN5 News) : శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి 71వ తిరుణాల మహోత్సవం విద్యుత్ ప్రభలు, వేదికలతోపాటు ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. దేవస్థానం పాలక మండలి, సహాయ కమిషనర్, కార్యనిర్వాహణాధికారి మదమంచి తిమ్మనాయుడు ఆధ్వర్యంలో మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించారు. తిరుణాళ్ల సందర్భంగా భక్తులకు నిత్యం అన్నదానం దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఏడాది ప్రత్యేకంగా సెల్ఫీ ఆంజనేయస్వామి, చెరుకు గడలతో ప్రత్యేక అలంకరణతో స్వామిని దర్శనం చేసుకున్నారు. ప్రసన్నాంజనేయ సేవకు చుట్టుప్రక్కల గ్రామాల నుండి మహిళా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. క్యూలైన్లో ఉన్న వారికి తాగునీరు, మజ్జిగ, చిన్నపిల్లలకు పాలు పంపిణీ చేశారు.
ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన్(Ongole MLA Damacharla Janardhanarao), చీరాల మాజీ శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి (ExMLA Karanama Balarama Krishnamurthy) సింగరకొండపై వేంచేసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి, దిగువన ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. కలెక్టర్ రాజాబాబు, ఎస్పి విష్ణువర్ధన్ రాజు దర్శించుకున్నారు. అన్నదాన సత్రాలలో ఉదయం నుండి అన్నదానం చేశారు. మండలంలోని పలు గ్రామాలు, పట్టణంలోని తెలుగుదేశం, జనసేన పార్టీలు, వైసిపి నాయకులు ఉత్సాహవంతులు తిరునాళ్లకు 9 విద్యుత్తు ప్రభలను ఏర్పాటు చేశారు. దేవస్థానం తరపున ఒక మినీ విద్యుత్తు ప్రభ ఏర్పాటు చేశారు. దేవస్థానం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కోలాటం, నాటకలు, సంగీత విభారి సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తిరుణాల ముగింపు సందర్భంగా స్వామివారి రథోత్సవం కనుల పండుగగా నిర్వహించారు.






