చీరాల : మొదటి మహిళా ఉపాధ్యాయని సావిత్రి బాయ్ పూలే జయంతి సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యార్థినులకు నిఘంటువులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జరిగిన సావిత్రీబాయి జయంతి సభలో కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారంటే దానికి ఆరోజు సావిత్రి బాయ్ చేసిన కృషే కారణమన్నారు. మహిళల్లో అక్షరాస్యత పెరిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అసమానతలు, వివక్ష తొలుగుతాయని భావించి వారికి విద్యాను అందించిన మొదటి మహిళా ఉపాధ్యాయని సావిత్రిబాయ్ పూలే అని పేర్కొన్నారు.
కళాశాల ప్రిన్సిపల్ రంగస్వామి మాట్లాడుతూ మహిళలకు విద్య అందించేందుకు ఆమె ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చిందన్నారు. అనేక అవమానాలు భరించారని వివరించారు. బాల్య వివాహాలు, మద్యపానం, సతీసహగమనంకు వ్యతిరేకంగా పోరాడరన్నారు. మహిళా సాధికారికతకు పునాది వేసింది సావిత్రిబాయేనని చెప్పారు. రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి వ్యవస్థాపక అధ్యక్షులు అడ్డ మల్లికార్జునరావు, డాక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ సావిత్రిబాయ్ చొరవతోనే బడుగు, బలహీన వర్గాల మహిళలు చదువుకో గలిగారని తెలిపారు. సమాజంలో అసమానతలు తొలగిపోవాలని తన భర్త జ్యోతిరావుపూలేతో కలసి ఆమె ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పార్థసారథి, కుసుమ కుమార్, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, పద్మారావు, సురేష్ పాల్గొన్నారు.