యురేనియం.. ఇప్పుడు ఇదే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. నల్లమల అడవిలో విస్తారంగా యురేనియం నిక్షేపాలు దాగి ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో మొత్తం 6 జిల్లాల్లో నల్లమల అడవి ఉండటంతో పాటు కృష్ణా నది వెంబడి 91 కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. యురేనియంతో ప్రయోజనం ఎంత ఉందో నష్టం కూడా అంతే ఉంది. యురేనియంతో అణు విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయొచ్చు. దీనితో అణుబాంబులు కూడా తయారు చేయొచ్చు. ఇందులో రెండు రకాలు ఉంటాయి. హై-గ్రేడ్ యురేనియం, లో-గ్రేడ్ యురేనియం. హై-గ్రేడ్ యురేనియంకు డిమాండ్ ఉంటుంది. లో- గ్రేడ్ యురేనియంకు పెద్దగా రేటు ఉండు. ఇప్పుడు నల్లమలలో ఉంది లో-గ్రేడ్ యురేనియం. కిలో సుమారు రూ. 1300 నుంచి 1500 వరకు ధర పలకవచ్చు. అదే హైగ్రేడ్ యురేనియం కిలో 13 వేల నుంచి 15 వేల వరకూ ఉంటుంది. నల్లమలలో దాదాపు 21 వేల టన్నుల యురేనియం ఉందని అంచనా. ఇక్కడ ఉంది లో-గ్రేడ్ యురేనియం కాబట్టి దీని తవ్వకాలకు అయ్యే ఖర్చు పోను పెద్దగా లాభం ఉండదనేది కూడా కొంతమంది భావన. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యురేనియంను ఎందుకు తవ్వకాలు జరపాలని అనుకుంటున్నాయి. ముందుగా మహబూబ్‌నగర్ జిల్లాలో తవ్వకాలు చేపట్టాలని అనుమతి ఇచ్చాయి. మొత్తం మూడు మండలాల్లో యురేనియంను వెలికితీయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే కడప జిల్లా పులివెందుల దగ్గర తుమ్మలపల్లి వద్ద యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ తవ్వకాల ప్రభావంతో తుమ్మలపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు రోగాల బారీన పడుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో మృతి చెందుతున్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం జిల్లాలకు రానుంది. యురేనియం తవ్విన తర్వాత శుద్ధి చేసేటప్పుడు రేడియో థార్మిక పవనాలు గాలిలో కలుస్తాయి. గాలి, వాతావరణం, చెరువులు, నదులు కలుషితమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లా ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని చెప్పాలి. మరోవైపు నల్లమలపై ఆధారపడి జీవించే కొన్ని జాతులు, జీవరాశులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. మరి ఇంత ప్రమాదం పొంచి ఉంటే రెండు తెలుగు ప్రభుత్వాలు ఎందుకు అనుమతిచ్చాయి.
2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రతిపాదన వచ్చింది. నల్లమల జంతు సంరక్షణ వైల్డ్ లైఫ్ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. నాటి ప్రతిపాదనకే ఇప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో అమ్రాబాద్ మండలంతో పాటు మరో రెండు మండలాల్లో తవ్వకాలకు సిద్ధమయ్యాయి. కానీ ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాధారణ జనాల నుంచి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సినీ సెలబ్రిటీస్ వరకూ పోరాటానికి సిద్ధమవుతున్నారు. అటు యురేనియం తవ్వకాలపై తెలంగాణ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఏపీ ప్రభుత్వం కూడా ఓ కమిటీని నియమించింది. మరి ఈ తరుణంలో ‘యురేనియం’ తవ్వకాలపై కేంద్రప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా.? పంతం నిలబెట్టుకుంటుందా? అనేది వేచి చూడాలి.
ప్రపంచ దేశాలన్నీ గ్లోబల్ వార్మింగ్ నివారణకు మొక్కలు పెంపకమే పరిష్కార మార్గమని తేల్చాయి. అందుకు అనుగుణంగా అడవుల సంరక్షణ, మొక్కల పెంపకంపై ప్రత్యేక కార్యాచరణ ప్రకటించాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 25కోట్ల మొక్కలు నాటాలని, జీవ వైవిధ్యం కాపాడాలని పర్యావరణ వేత్తలు చెబుతుంటే అభివృద్ధి పేరుతో ప్రకృతి విధ్వంసానికి ప్రభుత్వాలే అనుమతి ఇవ్వడం ముగజీవులకు, మానవాళి మనుగడకు శాపం కానుంది.
తెలుగు రాష్ట్రాలకు పచ్చని హారంగా ఉన్న నల్లమలను ధ్వంసం చేస్తే గాలి, నీరు, భూమి కలుషితం తోపాటు వాతావరణం మరింత వేడెక్కుతుంది. ఈ పాటికె పట్టణ ప్రాంతాల్లో సిమెంటు రోడ్ల పుణ్యమాని చలికాలంలోను వేసవిని తలపించే ఎండవేడి చూస్తున్నాం. వర్షాల క్రమం తప్పుంది. కురిస్తే వరదలు లేకుంటే వర్షం లేని అననుకుల వాతావరణ పరిస్థితులు చూస్తున్నాం. నల్లమల అడవిని తొలిస్తే ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి వాతావరణ సమతుల్యత ను కోల్పోతాం.
యురేనియం దేనికి
– అణువిద్యుత్ శక్తి తయారీ
– శత్రు దేశాలను నాశనం చేసేందుకు అవసరమైన అణు ఆయుధాలు తయారు చేసేందుకు
– ఈ రెండు తప్ప మరేదైనా ప్రయోజనం ఉందా?
పెరుగుతున్న జనాభా అవసరాలకు విద్యుత్ అవసరం ఉన్న మాట వాసవమే. అందుకు నల్లమల నుండి వస్తున్న జీవనదులైన కృష్ణ నదిపై జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెంచుకోవచ్చు. శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల ప్రాజెక్టుల పరిధిలోని ప్రధాన కాలువలపైన ప్రతి 100కిలోమాటర్లకు ఒకచోట మినీ పవర్ జెనరేటర్ ప్లాంట్లను నిర్మించవచ్చు. దీనివల్ల తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి తోపాటు సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయి.
మరో ప్రత్యామ్నాయం సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనివల్ల ప్రకృతికి ఎలాంటి నష్టం లేదు. పైగా తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. తెలుగు రాష్ట్రాలకు విస్తారమైన సముద్ర తీరంలో పవన విద్యుత్ ను ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశాలున్నాయి.
అణ్వాయుధాలు – పర్యవసానం
అణ్వాయుధాలు ఎంత ప్రమాదకరమో 70ఏళ్ల క్రితం అమెరికా హిరోషిమా, నాగసాకి పట్టణాలపై ప్రయోగించిన ప్రదేశాలే ఉదాహరణ. నేటికీ ఆయా పట్టణాలకు 100కిలోమీటర్ల పరిధిలో మొక్క మొలవదు. పుట్టే బిడ్డలు అంగవైకల్యం. అనారోగ్యం వెంటాడుతుంది. అణుబాంబు ప్రయోహించిన ప్రాంతమే కాదు అణు రియాక్టర్ పేలిన పుకుషిమా ప్రాంతం కూడా అదే పరిస్థితి. అందుకే అణు రియాక్టర్లను అమెరికా, జపాన్ దేశాలు రద్దు చేసుకున్నాయి.
అమెరికా, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం అణు రియాక్టర్లను మూసివేసిన పరిస్థితిని చూస్తున్నాము. అలాంటి ఔట్ డేటెడ్ సాంకేతికతను గొప్ప అభివృద్దిగా మనకు చెబుతూ అందమైన, ఆరోగ్యమైన సమస్త జీవకోటికి ఆవాసమైన మన అడవులను ప్రకృతి వనరులను నాశనం చేయడం అంటే మన భావితరాల భవిష్యత్ ను చిదిమేయడమే. అందుకే అడవులను, ప్రకృతిని, ముగజీవులను కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలు, ప్రజలపై ఉంది.